'సత్యవేడు' టీడీపీ ముసలం సుఖాంతం..!
తాజాగా సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న సస్పెండైన ఆదిమూలం చంద్రబాబును కలుసుకున్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీ నాయకులు మీడియాకు చెప్పకపోవడం గమనార్హం.
By: Tupaki Desk | 29 Oct 2024 10:27 AM GMTసత్యవేడు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం. 175 నియోజకవర్గాల్లో నిన్న మొన్నటి వరకు ఇదీ ఒకటి. కానీ, సెప్టెంబరు 12 న పేలిన ఓ బాంబు.. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తం హైలెట్ చేసింది. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు..(మాజీ వైసీపీ) కోనేటి ఆదిమూలం పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నాయకురాలే ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు.. ఆరోపణలు.. చూపించిన ఆధారాలు కూడా కలకలం రేపాయి.
దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేపై వేటు వేశారు. ఆ తర్వాత.. సదరు నాయకురాలు కేసు పెట్టడం.. దీనిపై విచారణ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ఈ కేసు యూటర్న్ తీసుకుంది. లైంగిక ఆరోపణలు చేసిన నాయకురాలు.. తర్వాత.. మాట మార్చి.. అలాంటిది ఏమీలేదని కోర్టులో కేసును వెనక్కి తీసుకున్నారు. దీంతో కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ, పార్టీ పరంగా చంద్రబాబు ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ముగ్గురు నేతలతో కూడిన కమిటీని వేసి.. అంతర్గతంగా రహస్య విచారణ చేయించారు. ఈ విచారణ తాలూకు నివేదిక పార్టీకి గత వారమే అందింది. అయితే.. దీనిని వెలుగులోకి రాకుండా.. రహస్యంగా ఉంచారు. కట్ చేస్తే..ఇప్పుడు మళ్లీ ఎందుకు ఈ ప్రస్తావన? అనే సందేహం వస్తుంది. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న సస్పెండైన ఆదిమూలం చంద్రబాబును కలుసుకున్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీ నాయకులు మీడియాకు చెప్పకపోవడం గమనార్హం.
మొత్తంగా త్రీమెన్ కమిటీ ఇచ్చిన నివేదిక, బాధితురాలి నంటూ.. మీడియా ముందుకు వచ్చి.. తర్వాత కేసు విత్ డ్రా చేసుకున్న మహిళ.. పార్టీకి ఇచ్చిన వాంగ్మూలం అన్నింటినీ పరిశీలించిన చంద్రబాబు ఆదిమూలం అమాయకుడేనని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆయనను సున్నితంగా మందలించి.. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలోనే సస్పెన్షన్ ఎత్తేయనున్నట్టు కూడా హామీ ఇచ్చారు. దీంతో ఆదిమూలం కథ.. అదేసమయంలో సత్యవేడు కథ కూడా సమాప్తమైంది.