గ్రామీణ పేదరికంపై ఎస్బీఐ రీసెర్చ్ ఆసక్తికర నివేదిక!
భారత్ లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
By: Tupaki Desk | 4 Jan 2025 4:00 AM GMTభారతదేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని.. పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారనే చర్చ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే... గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ లో పరిస్థితులు మారాయని.. గత 12 ఏళ్లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని ఎస్.బీ.ఐ. రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
అవును... భారత్ లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా... 2011-12లో గ్రామీణ పేదరికం 25.7 శాతంగా ఉండగా.. అది కాస్తా 2023-24కి వచ్చేసరికి 4.86 శాతానికి పరిమితమైందని వెల్లడించింది. ఇదే సమయంలో పట్టణ పేదరికంలో కూడా తగ్గుదల కనిపించిందని తెలిపింది.
ఇందులో భాగంగా... 2011-12లో పట్టణ పేదరికం సుమారు 13.7 శాతంగా ఉండగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అది కాస్తా 4.09 శాతానికి చేరిందని వెల్లడించింది. ఈ సందర్భంగా... ఈ స్థాయిలో అటు గ్రామీణ, ఇటు పట్టణ పేదరికం గణనీయంగా తగ్గడంపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక విషయాలు వెల్లడించింది.
ఈ క్రమంలో... ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో వినియోగ వృద్ధి పెరిగిందని, ఫలితంగా గ్రామీణ పేదరిక నిష్పత్తి తగ్గిందని తెలిపింది. ప్రధనాంగా ఆహార ధరలు పెరగిన సమయంలో ప్రభుత్వం తోడ్పాటు కీలకంగా మారిందన్ని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఇదే సమయంలో పట్టణ పేదరికం మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం... గ్రామీణ పేదరికం 2022-23లో 7.2శాతం ఉండగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4.86 శాతానికి చేరగా... పట్టణ పేదరికం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉండగా.. 2023-24 నాటికి అది కాస్తా 4.09 శాతానికి పరిమితమైంది. ఇదే సమయంలో... తీవ్రమైన పేదరికం చాలా తగ్గింది.