ఎస్సీ వర్గీకరణ సాధ్యమేనా... మోడీ ఎందుకు హామీ ఇచ్చారు...?
ఇక తాజాగా చూస్తే నరేంద్ర మోడీ మాదిగల ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోర్టుల ద్వారా అయితే ఆ విధంగానూ చూస్తామని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 13 Nov 2023 3:15 AM GMTషెడ్యూల్ కులాల వర్గీకరణ అన్నది పాతిక ఏళ్ల నాటి డిమాండ్. కులాలలో ఉప కులాలకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ వచ్చిన ఈ డిమాండ్ నెరవేరాలీ అంటే రాజ్యాంగ సవరణ అవసరం అని అంటున్నారు. ఇక సుప్రీం కోర్టు 2020 ఆగస్టులో అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం అయితే ఎస్సీ ఎస్టీలలో కొన్ని కులాలు మిగిలిన కులాల కంటే వెనకబడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అంతే కాదు దీనిని మరింత విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఇక రాజకీయ పరంగా చూసినపుడు ఇప్పటికి సరిగ్గా 27 ఏళ్ళ క్రితం ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమం పుట్టుకొచ్చింది. నాడు ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎం గా ఉన్నారు. అప్పట్లో సంప్రదాయా ఎస్సీ ఓట్లు అన్నీ కాంగ్రెస్ కే వెళ్తున్నాయి. దాంతో మాదిగలను వేరు చేయడం ద్వారా రాజకీయ లాభం కోసమే ఇలా చేశారు అని విమర్శలు వచ్చాయి.
ఇక నాటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ పేరిట చట్టం చేసింది. అలా అయిదేళ్ల పాటు ఉమ్మడి ఏపీలో వర్గీకరణ కొంత అమలు జరిగింది. కానీ దీన్ని సుప్రీం కోర్టు 2004 నవంబర్ లో అంటే ఇప్పటికి 19 ఏళ్ళ క్రితం కొట్టేసింది.
నాటి నుంచి ఈ రోజు వరకూ ఉద్యమం సాగుతూనే ఉంది. ఈ మధ్యలో మాదిగల పోరాట సమితి నేత మం ద క్రిష్ణ మాదిగ తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీలతో కలసి వారి మద్దతు తీసుకుని మరీ వర్గీకరణకు అలుపు లేకుండా పోరాడుతున్నారు.
ఇక తాజాగా చూస్తే నరేంద్ర మోడీ మాదిగల ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోర్టుల ద్వారా అయితే ఆ విధంగానూ చూస్తామని పేర్కొన్నారు. అయితే ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఏకంగా పదమూడు రాష్ట్రాలు ఈ వర్గీకరణ వద్దు అంటున్నాయి.
మరి రాజ్యాంగ సవరణ జరగాలీ అంటే అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల వరకూ చూస్తే ఉమ్మడి ఏపీలో ఈ పోరాటం బలంగా కనిపించినా విభజన ఏపీలో మాత్రం కేవలం తెలంగాణాకే పరిమితం అయినట్లుగా ఉంది. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలోని ఉమ్మడి పది జిల్లాలలో మాలల కంటే మాదిగల జనాభా 17 లక్షలకు పైగా ఎక్కువ. వారి ఉనికి అన్ని చోట్లా అక్కడ ఉంది.
మొత్తం ఎస్సీలలో అరవై శాతంగా మాదిగలు ఉన్నారని ఈ రోజు లెక్కలు కూడా చెబుతున్నాయి. ఇక ఏపీలో చూస్తే క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు తప్ప మాదిగలు మిగిలిన జిల్లాలలో బాగా తక్కువ. దాంతో ఏపీలో మాలల ఆధిక్యమే ఉంది. దాంతో ఈ సమీకరణాలలో తేడాలు వస్తున్నాయి.
ఏది ఏమైనా ఎన్నికల వేళ మోడీ హామీ ఇచ్చారు. మాదిగల ఓట్లను బీజేపీ వైపు తిప్పుకోవాలన్నదే ఈ ఎత్తుగడ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీకి అంత ప్రేమ ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు పట్టించుకోలేదని కూడా దుయ్యబెడుతున్నాయి. అయితే మోడీ హామీ ఇచ్చినంత ఈజీగా వర్గీకరణ జరగదని కూడా అంటున్నారు. మరి మోడీ నిండు సభలో హామీ ఇచ్చేశారు. అది ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతుంది అన్నది చూడాలని అంటున్నారు.
బీజేపీ అసాధ్యమైన కాశ్మీర్ 370 ఆర్టికల్ ని రద్దు చేసింది. అయోధ్య రామమందిరం ఆలయం విషయంలో న్యాయ స్థానాల ద్వారా పరిష్కారాన్ని కనుగొంది. మరి వర్గీకరణ విషయంలో బీజేపీ తలచుకుంటే చేయగలదు అని అంటున్న వారూ ఉన్నారు. స్వయనగ మోడీ ఇచ్చిన హామీ కాబట్టి నెరవేరుతుందా అనంది కూడా ఇపుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.