Begin typing your search above and press return to search.

బీసీ బాటలోనే ఎస్టీ నేతలు!

జనాభా దామాషా ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నియోజకవర్గాలు కేటాయించాలని ఇప్పటికే బీసీ సంఘాల నేతలు వార్నింగులు ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   29 Sep 2023 11:30 AM GMT
బీసీ బాటలోనే ఎస్టీ నేతలు!
X

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో తలనొప్పులు మెల్లిగా మొదలవుతోంది. ఇప్పటికే బీసీ నేతలు పెద్ద తలనొప్పిగా మారగా వీళ్ళ బాటలోనే ఎస్టీ నేతలు కూడా తయారయ్యారు. జనాభా దామాషా ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నియోజకవర్గాలు కేటాయించాలని ఇప్పటికే బీసీ సంఘాల నేతలు వార్నింగులు ఇస్తున్నారు. పార్టీ అధిష్టానంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రదేశ్ ఎన్నికల కమిటికి బీసీ నేతలు గట్టిగా చెప్పారు.

అయితే ఇక్కడ చెప్పి ఊరుకుంటే లాభం లేదని చెప్పి బీసీ నేతలు కొందరు ఢిల్లీకి వెళ్ళారు. బీసీల జనాభా దామాషా ప్రకారం తమకు కచ్చితంగా 50 సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీసీలకు సుమారు 40 సీట్లు దక్కే అవకాశం ఉందట. అయితే ఈ సంఖ్యతో బీసీల నేతలు ఏ మాత్రం రాజీపడటం లేదు. అందుకనే అధిష్టానంపై ఒత్తిడి పెట్టేందుకు ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారు.

వీళ్ళ డిమాండ్ ఏమవుతుందో తెలీదు కానీ సడెన్ గా ఎస్టీ నేతలు కూడా ఇదే డిమాండ్ మొదలుపెట్టారు. వీళ్ళు మరో అడుగు ముందుకేసి రిజర్వుడు సీట్లలోనే కాకుండా తమకు జనరల్ సీట్లలో కూడా టికెట్లు ఇవ్వాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం 12 సీట్లు రిజర్వయ్యాయి. అయితే ఎస్టీ నేత రాములునాయక్ లాంటి వాళ్ళు అదనంగా 3 జనరల్ సీట్లు కేటాయించాల్సిందే అని పట్టుబడుతున్నారు.

తమకు అదనంగా 3 జనరల్ సీట్లను కేటాయిస్తే మొత్తం 119 నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ కు ఎంతో ఉపయోగం ఉంటుందని మాజీ ఎంఎల్సీ రాములునాయక్ అంటున్నారు. తమ రిజర్వుడు సీట్లను తమకు కేటాయించటంలో పార్టీ గొప్పేముందని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ కోణంలో సమస్య ఏమిటంటే ఇపుడు ఎస్టీలకు జనరల్ సీట్లను కేటాయిస్తే రేపు వెంటనే ఎస్సీలు కూడా డిమాండ్లు మొదలుపెట్టేస్తారు. అప్పుడు వాళ్ళకు ఏమిచేస్తారు ? ఎస్టీలకు జనరల్ సీట్లు కేటాయిస్తే ఎస్సీలకు కూడా కేటాయించక తప్పదు. మరీ సమస్యను కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సిందే.