కొత్త స్కూల్... మీ పిల్లలను ప్రొఫెషనల్ దొంగలుగా మార్చబడును!
అవును... ఇప్పటివరకూ చూసిన స్కూళ్లకు ఇది పూర్తిగా విభిన్నం! ఇక్కడ దొంగతనాలూ నేర్పిస్తారు
By: Tupaki Desk | 20 Aug 2024 7:30 PM GMTఇచ్చటం దొంగతనాలు ఎలా చేయాలో నేర్పబడును.. చోరీలు చేయడంలో మీ పిల్లలు చురకత్తుల్లా మార్చబడును.. జనాలు అధికంగా ఉన్న చోట జేబులు ఎలా కొట్టేయాలో ట్రైనింగ్ ఇవ్వబడును.. బెదిరించి డబ్బులు ఎలా లాక్కోవాలో నేర్పడం బోనస్.. ఇలాంటి బోర్డులు ఉన్న స్కూల్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి పిల్లల తల్లితండ్రులు లక్షలు చెల్లిస్తున్నారని తెలుసా?
అవును... ఇప్పటివరకూ చూసిన స్కూళ్లకు ఇది పూర్తిగా విభిన్నం! ఇక్కడ దొంగతనాలూ నేర్పిస్తారు! దీంతో... 64 కళల్లో చోరకళ కూడా ఒకటి అని భావించారో.. లేక, చదువుకున్నా ఉద్యోగాలు లేవు, ఎందుకొచ్చిన చదువుల్లే ఏ "చేతి" పనో నేర్పిస్తే వాళ్ల బ్రతుకులు వాళ్లు బ్రతుకుతారు.. పోలీసులకు దొరికితే ప్రభుత్వమే వాళ్లకు మూడు పూటలా భోజనం పెడుతుందని భావించారో తెలియదు కానీ... తల్లి తండ్రులు తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు.!
వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 117 కిలోమీటర్ల దూరంలోని రాజ్ గఢ్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన గుల్ఖెడి, కడియా, హుల్ఖేడిలో పిల్లలకు దోపిడీలు, దొంగతనాలు, దాడిచేసి డబ్బులు లాక్కోవడాలు వంటి పనులను నేర్పిస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే... తల్లితండ్రులు కూడా 12-13 సంవత్సరాలు వచ్చిన తమ పిల్లలను ఈ తరహా శిక్షణకు జాయిన్ చేస్తున్నారు.
అలా అని దీనికి ఫీజు ఏమీ ఉండదనుకోకండి!... ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేటంత ఫీజులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా రూ.2 నుంచి 3 లక్షల మధ్య ఫీజు చెల్లించాలి. అప్పుడు చిన్నారులను భావిభారత క్రిమినల్స్ గా మార్చడానికి అవసరమైన స్కిల్స్ ను నేర్పిస్తారు అక్కడను సీనియర్ నేరగాళ్లు! పైగా ఇక్కడ ప్లేస్ మెంట్ గ్యారెంటీ ఆప్షన్ కూడా 100% కన్ఫాం!
ఎందుకంటే.. ఒక్కసారి 2 నుంచి 3 లక్షలు చెల్లించి పిల్లలను ఈ "శిక్ష"ణా సంస్థ నిర్వాహకులకు అప్పగించేస్తే... ఏడాది పాటు శిక్షణ పూర్తయ్యాక ఆ పిల్లల తల్లితండ్రులకు ఆ శిక్షణా సంస్థ నిర్వాహకులే ఏడాదికి రూ.3 నుంచి 5 లక్షల మధ్య డబ్బు పంపిస్తుంటారు. వారి వారి పిల్లలు జైలుకు వెళ్లకపోతే అప్పుడప్పుడూ సమ్మర్ హాలిడేస్ కింద ఓ 15 రోజులో 20 రోజులో సెలవులకు ఇంటికి పంపిస్తుంటారంట!
ప్రస్తుతం ఇలాంటి పిల్ల దొంగలు దేశవ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా ఉన్నారని.. వీరంగా పలు వివాహ వేడుకల్లో చోరీల కేసుల్లో ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఈ నేరగాళ్లు బ్యాగులు ఎత్తుకెళ్లడం.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద డబ్బులు కాజేయడం మొదలైన నేరాల్లో వీరు సమగ్ర శిక్షణ తీసుకునే ఇలాంటి పనుల్లోకి ఎంటర్ అవుతున్నారని చెబుతున్నారు.
రూ.1.5 కోట్ల హైదరాబాద్ వ్యాపారి నగలు ఎత్తుకెళ్లింది ఈ బ్యాచ్ కుర్రాడే!:
అవును... ఇప్పటికే ట్రైనింగ్ పూర్తై డ్యూటీ ఎక్కేసిన కుర్రాళ్లు జైపూర్ సహా దేశమంతా విస్తరించేశారని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 8న జైపూర్ లోని హయత్ హోటల్ లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఓ భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమారుడి పెళ్లిలో ఓ మైనర్ రూ.1.5 కోట్ల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు.
ఇందులో భాగంగా... ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతున్న పెళ్లిలోకి ఎంటరైన 14 ఏళ్ల బాలుడు ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగలు ఉన్న బ్యాగును తీసుకుని చక్కగా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు చూసిన పోలీసులు అతని చోరకళకు షాకయ్యారని అంటుంటారు. ఈ రేంజ్ లో మైనర్ లకు ట్రైనింగ్ ఇచ్చి దేశం మీదకు వదులుతున్నారంట సదరు శిక్షకులు!