దేవుడు ఉన్నాడా? లేడా? కొత్త వాదన విన్నారా?
ఇప్పుడీ తేలని పంచాయితీని ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? అన్న సందేహానికి వస్తున్నారా? అక్కడికే వస్తున్నాం.
By: Tupaki Desk | 12 March 2025 4:00 PM ISTదేవుడు ఉన్నాడా? లేడా? అన్న ప్రశ్న ఇప్పటిది కాదు. మనిషి పరిణామక్రమంలో వేలాది ఏళ్ల నుంచి వస్తున్నదే. నిజానికి దేవుడు అనే వాదనతోనే మానవాళికి సంబంధించిన ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి అత్యాధునిక కాలంలోనూ దేవుడి చుట్టూనే రాజకీయ.. సామాజిక.. ఆర్థిక అంశాలే కాదు.. మన బతుకులు ఎలా ఉండాలన్నది డిసైడ్ చేస్తుంది. మరి.. దేవుడి విషయంలో నమ్మకాలు.. భావోద్వేగాల్ని పక్కన పెట్టేద్దాం. మరి.. సైన్స్ ఏం చెబుతుంది? అన్న ప్రశ్న తెర మీదకు వచ్చినప్పుడు సమాధానాలు పెద్దగా కనిపించవు.
దేవుడు ఉన్నాడా? లేడా? అన్న దానిపై ఆస్తికులు.. నాస్తికుల వాదనలు తెలుసు. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడీ తేలని పంచాయితీని ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? అన్న సందేహానికి వస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖగోళ.. భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు. అదేమంటే.. దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందన్నది ఆయన వాదన.
జీవం పుట్టుకకు కచ్ఛితమైన.. నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే.. అవేవో యాక్సిడెంటల్ గా జరిగినవిగా కనిపించవన్నది ఆయన మాట. జీవం మనుగడ సాగించటానికి వీలుగా విశ్వాన్ని రచించినట్లుగా ఆయన చెబుతున్నారు. ఇందుకు బిగ్ బ్యాంగ్ థియరీని ప్రస్తావిస్తూ.. మహా విస్పోటనం జరిగినప్పుడు పదార్థం.. వ్యతిరేక పదార్థం రెండు పుట్టుకొచ్చాయని.. పదార్థం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడటమే జీవం పుట్టుకకు కారణమైందని ఆయన చెబుతున్నారు.
విశ్వంలోని వివిధ మూలకాలు.. అంశాల్ని చూసినప్పుడు ఏదో అత్యున్నత శక్తి పని చేస్తున్నట్లుగా చెబుతారు. దీనికి ఉదాహరణగా గురుత్వాకర్షణ సమాన స్థితిలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరేలా చేస్తుంది. అదే గురుత్వాకర్షణశక్తి బలహీనంగా ఉంటే.. నక్షత్రాలు.. నక్షత్ర మండలాలు.. గ్రహాలు ఏర్పడేవి కాదు కదా? ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి మరికాస్త బలంగా ఉండే క్రిష్ణబిలంలో విశ్వం కుప్పకూలిపోయేది కదా? అన్నది మరో ప్రశ్న.
ప్రోటాన్ ఎలక్ట్రాన్ ద్రవ్యరాణి నిష్పత్తి భిన్నంగా ఉంటే.. డీఎన్ఏ లాంటి అణువులు ఏర్పడటం సాధ్యమయ్యేది కాదు. విశ్వం విస్తరిస్తున్న వేగాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది మరీ వేగంగా విస్తరించినా.. త్వరగా కుప్పకూలినా విశ్వంలో జీవం పుట్టుకొచ్చేది కాదన్న మాట ఆయన చెబుతున్నారు. ఇదంతా విన్నప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం (సుమారు అరవైల్లో)దేవుడిని గొప్ప గణితవేత్తగా సైన్స్ పత్రికల్లో వ్యాసాలు రాసిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ డిరాక్ గుర్తుకొస్తారు. దేవుడి గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ.. ‘‘దేవుడు మహా గొప్ప గణితవేత్త. ఆయన విశ్వ నిర్మాణంలో గణితాన్ని గొప్పగా వాడుకున్నారు’’ అని చెప్పటం తాజా వాదనతో గుర్తుకొస్తుంది.