క్రిస్మస్ తాత అసలు ముఖం... ఫోటోలు విడుదల చేసిన శాస్త్రవేత్తలు!
ప్రశాంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో ఉన్న వ్యక్తి.. భుజాన బహుమతుల మూటతో ఉంటారు. ఈ సందర్భంగా.. క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందనే ఫోటోలు విడుదల చేశారు శాస్త్రవేత్తలు.
By: Tupaki Desk | 8 Dec 2024 9:30 PM GMTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలైన సంగతి తెలిసిందే. యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా పాటలు పాడుకుంటూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సన్నివేశాలు కనిపిస్తుంటాయి. చర్చిలను ఎంతో అందంగా అలంకరిస్తుంటారు. ప్రతీ ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తుంటాయి. ఈ సమయంలో మరో పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది.
క్రిస్మస్ వచ్చిందంటే ప్రత్యేకించి చిన్నపిల్లలైతే ఆయన్ను గుర్తుతెచ్చుకోకుండా ఉండరు. ఆయనే.. శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత). ఎర్ర బట్టలు, తెల్ల గడ్డంతో.. ప్రశాంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో ఉన్న వ్యక్తి.. భుజాన బహుమతుల మూటతో ఉంటారు. ఈ సందర్భంగా.. క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందనే ఫోటోలు విడుదల చేశారు శాస్త్రవేత్తలు.
అవును... క్రీస్తు శకం 280 కాలంలో సెయింట్ నికోలస్ అనే మాంక్ ఉండేవారని.. ఆయన ప్రస్తుతం టర్కీగా పిలిచే మైరా అనే ప్రాంతంలో జన్మించారని చెబుతారు. ఈయన తనకున్నదంతా పేదలకు పంపి పెడుతూ సాయం చేస్తూ ఉండేవారని అంటారు. ఈ క్రమంలో... ఓ సారి ఓ తండ్రి.. ముగ్గురు కుమర్తెలకు పెళ్లి చేయడానికి డబ్బులేక వారి అమ్మేయాలని నిర్నయించారట.
ఆ సమయంలో శాంటా క్లాస్ అడ్డుపడ్డారని.. వారి వివాహానికి కావాల్సిన ధన సహాయం చేశారని చెబుతారు. ఈ క్రమంలో 19వ శతాబ్ధం మొదటి నుంచి క్రిస్మస్ సమయంలో ఆయన వేషదారణలో.. పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆచారంగా మారిందని చెబుతారు! అక్కడ నుంచి ఈ వేషదారణ అందరినీ బాగా ఆకర్షించడం మొదలుపెట్టిందని చెబుతారు.
ఈ క్రమంలో 1822లో క్లెమెంట్ క్లార్క్ మూర్ అనే కవి.. "యాన్ అకౌంట్ ఆఫ్ ఎ విజిట్ ఫ్రం సెయింట్ నికోలస్" అనే ఓ పద్యం రాశారు! ఇది "ఇట్ వజ్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్" అనే పేరుతో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం శాటా క్లాజ్ అంటే ఎలా ఉంటారు అని అంతా అనుకుంటున్నారో అలా వర్ణించింది ఈయనే అని చెబుతారు.
1881లో థామస్ నాస్ట్ అనే పొలిటికల్ కార్టునిస్ట్ ప్రస్తుత శాంటా క్లాస్ ఇమేజ్ ని మొదటిసారిగా తెరకెక్కించారు! ఈ నేపథ్యంలో అసలు వాస్తవంగా సెయింట్ నికోలస్ ఎలా ఉంటారనే విషయాన్ని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు! ఎన్నో పరిశోధనల అనంతరం సైంటిస్టులు 3డీ చిత్రాలా ఆధారంగా అతని ముఖాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా... సెయింట్ నికోలస్ ఇలా ఉండవచ్చు అంటూ శాంటాకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక సరిగ్గా క్రిస్మస్ సీజన్ కూడా కావడంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే క్రిస్మస్ సంబరాల్లో ఈ ఫోటోలు దర్శనమివ్వబోతున్నాయని అంటున్నారు!