Begin typing your search above and press return to search.

3 టీమ్ లతో 6 వారాల అధ్యయనం.. సోషల్ మీడియా సమస్యకు ఆసక్తికర పరిష్కారం!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ‘సోషల్ మీడియా వినియోగం.. ప్రధానంగా పిల్లలు, యువతపై దీని ప్రభావం’ అనే అంశంపై తీవ్ర చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Nov 2024 9:30 AM GMT
3 టీమ్  లతో 6 వారాల అధ్యయనం.. సోషల్  మీడియా  సమస్యకు ఆసక్తికర పరిష్కారం!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ‘సోషల్ మీడియా వినియోగం.. ప్రధానంగా పిల్లలు, యువతపై దీని ప్రభావం’ అనే అంశంపై తీవ్ర చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... దీని వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువని.. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంతర్జాతీయంగా పలు అధ్యయనాలు వెల్లడించాయి!

అయితే... ఈ సమస్యకు తాజా అధ్యయనం ఓ ఆసక్తికర పరిష్కారాన్ని చూపిస్తోంది. ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా సోషల్ మీడియాను ఎలా ఉపయోగించొచ్చో చెబుతోంది. యువత ఎంత సేపు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు అనేదానికంటే.. ఏ విధంగా ఉపయోగిస్తున్నారనేది అత్యంత కీలకం అని చెబుతూ... ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అవును... సోషల్ మీడియాను పూర్తిగా వదిలేయాలని కొంతమంది, అది లేకపోతే ప్రపంచానికి దూరమైపోతామని ఇంకొంతమంది చెబుతుంటారు. సోషల్ మీడియా వల్ల తీవ్రమైన మెంటల్ టెన్షన్ అని కొంతమంది చెబుతుంటే.. ఇది ఉండబట్టే ఎప్పుడెప్పుడో మిస్సైపోయిన స్నేహాలు, బంధాలు తిరిగి పొందగలిగామని ఇంకొంతమంది అంటుంటారు.

ఈ సమయంలో... బ్రిటీష్ కొలంబియా వర్సిటీలోని పరిశోధకుల కొత్త అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది. సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమోరి మికామియాండ్ నేతృత్వంలో జరిగిన పరిశోధన.. సోషల్ మీడియాను వదిలేసిన, అందులో మునిగిపోయిన, దాన్ని ఆలోచనాత్మకంగా ఉపయోగించిన వారిలో కలిగిన మానసిక ఆరోగ్య ప్రభావలను పరిశీలించి వెల్లడించింది.

దీనికోసం 17 - 29ఏళ్ల వయసులోని 393 కెనడియన్ యువకులను ఎంచుకోంది డాక్టర్ మికామి బృందం. వీరిని మూడు టీమ్ లుగా విభజించింది. వీరిలో ఒక టీమ్ సభ్యులు పూర్తిగా సోషల్ మీడియా వాడకాన్ని వదిలేయగా.. మరో టీమ్ వారు రెగ్యులర్ గా సోషల్ మీడియా వాడకాన్ని కంటిన్యూ చేశారు. మూడో టీమ్ మాత్రం ఆలోచనాత్మకంగా, ప్లానింగ్ గా వాడింది!

సుమారు ఆరు వారాల పాటు ఈ సాగిన ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఇందులో ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. సోషల్ మీడియాను పూర్తిగా వదిలేసినవారిలో.. నిరాశ, ఒత్తిళ్లు, ఆందోళన వంటి లక్షణాలు మరింత తగ్గగా... ఒంటరి తనం అనే భావనలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించలేదని తేలిందని అంటున్నారు.

ఇదే సమయంలో.. సోషల్ మీడియాను పూర్తిగా వదిలేసిన వారు.. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సామాజిక సంబంధాలకు దూరమైనట్లు తేలిందట. ఇక.. అదే పనిగా గంటల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన టీమ్ విషయానికొస్తే... వీరిలో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తేలిందని డాక్టర్ మికామీ తెలిపారు.

ఇదే సమయంలో తీవ్రమైన ఆందోళన, ఒత్తిళ్లు, అలసట, నిర్వేదం వంటి లక్షణాలు బయటపడ్డాయని వెల్లడించారు. సోషల్ మీడియాకు సంబంధించిన దుష్ఫలితాలకు వీరు అసలు సిసలు బానిసనలని అన్నారు. ఇక మూడో టీమ్ విషయానికొస్తే... వీరు ఆలోచనాత్మకంగా సోషల్ మీడియాను ఉపయోగించేవారు.

వీరు.. అసూయ లేదా ప్రతికూల పోలికలను ప్రేరేపించే అకౌంట్స్ ను మ్యూట్ / క్విట్ చేయడం.. అతంత సన్నిహిత స్నేహాలకు, బంధాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం.. అవసరమైన అంశాలపైనే స్పందిస్తూ.. అనవసరమైన విషయాలకు లైక్ లు, షేర్లు కొట్టడం వంటి వాటికి దూరంగా ఉండటం చేశారట.

ఇదే సమయంలో తాము మెసేజ్ పెట్టాలనుకున్నవారికి నేరుగా సందేశాలు పంపారని, సంభాషించారని చెబుతున్నారు. ఫలితంగా... వీరు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాలేదని.. ఇదే సమయంలో తాము ఒంటరి అనే భావనకు లోను కాలేదని డాక్టర్ మికామీ తెలిపారు. ఇది సరైన ప్రక్రియ అని అన్నారు.

సోషల్ మీడియా యూజర్లు ఈ విధంగా సమతుల్యతను పాటిస్తూ వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలూ ఉండవని తెలిపారు. అయితే ఒకేసారి ఈ విధంగా మారిపోవడం చాలా మందికి సాధ్యం కాకపోవచ్చని.. వారు గ్రాడ్యువల్ గా ఒక్కో అనవసర విషయాన్ని వదిలేసుకుంటూ క్రమక్రమంగా అలవరుచుకుంటే మంచిదని చెబుతున్నారు!