ఊహకు అందని అద్భుతాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
అదేమంటే.. అతి పెద్ద.. అత్యంత సదూర నీటి మేఘాన్నిఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
By: Tupaki Desk | 16 Dec 2023 4:24 AM GMTఅవును.. చదివినంతనే నిజమా? అంటూ ఆశ్చర్యపోయే అద్భుతాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంతో ఇప్పటివరకు ఉన్న ఖగోళ లెక్కలు మారిపోనున్నాయి. అంచనా కూడా వేయలేనంతగా ఉన్న ఈ వ్యవహారం ఖగోళ శాస్త్రవేత్తల్లో సంచలనమైంది. అదేమంటే.. అతి పెద్ద.. అత్యంత సదూర నీటి మేఘాన్నిఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీని సైజ్ ఎంతో తెలిస్తే నోట మాట రాదు. ఎందుకంటే.. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ఉండే భారీ జలనిధి కావటమే. యూనిలాడ్ అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ఈ సంచలన అంశాన్ని ప్రచురించింది. దాని కథనం ప్రకారం క్వేసార్ అనే పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ (క్రిష్ణ బిలం) చుట్టూ ఇది ఆవిరి రూపంలో విస్తరించి ఉన్నట్లుగా పేర్కొన్నారు.
అయితే.. ఈ భారీ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుందని.. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుందని చెబుతున్నారు.
దీని పరిణామానికి తగ్గట్లే.. అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని అక్రమిస్తుందని అంచనా వేస్తున్నారు. విశ్వం ప్రారంభ సమయంలో అంతటా నీరే వ్యాపించి ఉందనటానికి ఇదో నిదర్శనంగా చెబుతున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ విష్కరణ ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. దీంతో.. ఇప్పటివరకున్న లెక్కల్లో మార్పులు చోటు చేసుకునే వీలుందంటున్నారు.