Begin typing your search above and press return to search.

ఎస్సీ రిజర్వుడు సీటుగా పులివెందుల ?

పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది. 1978లో తొలిసారిగా వైఎస్సార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:54 AM GMT
ఎస్సీ రిజర్వుడు సీటుగా పులివెందుల ?
X

పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది. 1978లో తొలిసారిగా వైఎస్సార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆనాటి నుంచి వైఎస్సార్ కుటుంబమే పులివెందులలో రాజ్యమేలుతోంది. వైఎస్సార్ తరువాత వైఎస్ వివేకాందరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ ఇలా ఎమ్మెల్యేలుగా ఉంటూ వచ్చారు. 2014 నుంచి పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్న జగన్ 2024లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు

పులివెందుల ఇద్దరు సీఎంలను అందించింది. వైఎస్సార్ జగన్ ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం లు అయ్యారు. మరి రాజకీయంగా చూస్తే ఎంతో విశిష్టతను సంతరించుకున్న పులివెందుల సీటు 2029 నాటికి వైఎస్ జగన్ పోటీ చేసేందుకు వీలు కల్పించదా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది. అంతే కాదు పులివెందుల ఎస్సీ సీటుగా మారుతుంది అని అంటున్నారు

దానికి కారణాలు చూస్తే కనుక చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 11 సీట్లను మాత్రేమ వైసీపీ గెలుచుకుంది. ఈ నేపధ్యంలో 2029 నాటికి అధినేత జగన్ ని సైతం ఓడించడానికి టీడీపీ పావులు కదుపుతోంది అని అంటున్నారు.

దానికి కలసి వచ్చిన అవకాశం 2926 నాటికి జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అని చెబుతున్నారు. అలా పునర్విభజనలో జగన్ పులివెందుల సీటు ఎస్సీ రిజర్వుడు గా మరితే అది వైసీపీకి భారీ దెబ్బ పడే చాన్స్ ఉంది అని అంటున్నారు

మరి అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గాల డీ లిమిటేషన్ ప్రక్రియ మరో రెండేళ్లలో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు అయితే దేశంలో తాజా జనాభా గణన ఆధారంగా అసెంబ్లీ లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజన చేయడానికి డీలిమిటేషన్ కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయని అంటున్నారు.

ఈ విధంగా చేసే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల డీలిమిటేషన్ తో పాటు రొటేషన్ కూడా ఉంటుందన్నది తెలిసిందే. అలా . ఒక్క నియోజకవర్గం కూడా శాశ్వతంగా ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వ్‌డ్‌గా ఉండకుండా రొటేషన్ విధానంలో రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు మార్చబడుతూ వస్తున్నాయి.

మరో వైపు చూస్తే భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఎన్నికల కమిషన్‌తో కలిసి పని చేస్తుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. అలా ఈ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతుంది. అలాగే డీ లిమిటేషన్ మీద చర్యలు తీసుకుంటుంది. ఒక్కసారి ఈ కమిషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ఎక్కడా ప్రశ్నించలేరు. ఎందుకంటే అంతలా చట్టబద్ధత కలిగిన కమిషన్ గా ఇది ఉంటుంది.

దీనికి ముందు చూస్తే రెండు దశాబ్దాల క్రితం 2006లో అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ అధికారంలో ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా డీ లిమిటేషన్ తో పాటు పునర్విభజన చేసుకుందని టీడీపీ గగ్గోలు పెట్టింది

అలా తెలుగుదేశం పార్టీ పునర్విభజన ప్రక్రియను తీవ్రంగా విమర్శించింది, ఇది అప్పటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించింది. కానీ చివరికి అవే అమలులోకి వచ్చాయి. టీడీపీ ఏమీ చేయలేక పోయింది. ఇపుడు అధికారంలో టీడీపీ ఉంది. దాంతో వైసీపీ మీదనే 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఏపీలో చూస్తే 2026లో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ రాజకీయంగా వైసీపీ మీదనే గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే అసెంబ్లీ పునర్విభజన ప్రక్రియలో భాగంగా జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులను ఎస్సీ నియోజకవర్గంగా మార్చేందుకు సైతం చూస్తారు అని అంటున్నారు

అలా కేంద్రంలోని ఎన్డీయేను, కమిషన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళన వైసీపీ నేతలలో అపుడే మొదలైంది అని అంటున్నారు. అసలే రాజకీయ చాణక్యుడు అయిన చంద్రబాబు 2026లో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా వైసీపీ రాజకీయ అవకాశాలను పూర్తిగా దెబ్బ తీస్తారని కూడా తలచుకుని కలవరపడుతున్నారుట.

ఒకవేళ వైసీపీ గెలిచి జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పాన్ని ఎస్సీ నియోజకవర్గంగా చేసి ఉండేవారు అని కూడా టీడీపీ సానుభూతిపరులు భావిస్తున్నారు. అలాంటి చర్య వల్ల 2029 నాటికి కూడా టీడీపీ కోలుకోకుండా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇపుడు టీడీపీ చేతిలో అధికారం ఉంది. దాంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం చూసుకుంటే 2014 నాటి కంటే కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంటున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి పెరుగుతాయని అంటున్నారు. దీంతో 2029 ఎన్నికల్లో గెలుపు కోసం అలాగే వైసీపీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయడం కోసం టీడీపీ వచ్చిన ఈ అవకాశాలను ఏ మాత్రం వదులుకోదు అనే అంటున్నారు. మొత్తానికి పులివెందుల ఎస్సీ రిజర్వ్డు అయితే మాత్రం జగన్ కొత్త సీటుని 2029లో వెతుక్కోవాల్సిందే అని అంటున్నారు.