Begin typing your search above and press return to search.

బీజేపీకి 370 సీట్లు... ఆశ వెనక అజెండా ..!?

అదే సమయంలో బీజేపీకి 370 సీట్లు ఎలా సొంతంగా సంపాదిస్తుంది అన్నది కూడా చూడాలి.

By:  Tupaki Desk   |   17 Feb 2024 3:15 AM GMT
బీజేపీకి 370 సీట్లు... ఆశ వెనక  అజెండా ..!?
X

దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ సక్రమంగా ఉపయోగించుకుంది. దేశమంతా జై శ్రీరాం నినాదాలతో బీజేపీ తన రాజకీయ అవకాశాలను సైతం మెరుగుపరచుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉత్తరాదిలో కమల వికాసానికి అవకాశాలు బాగా మెరుగు అయ్యాయి. బీజేపీకి ఈసారి బాగానే సీట్లు రావచ్చు అన్నది ఒక లెక్క.

అదే సమయంలో బీజేపీకి 370 సీట్లు ఎలా సొంతంగా సంపాదిస్తుంది అన్నది కూడా చూడాలి. అసలు ఇది సాధ్యమేనా అన్న చర్చ కూడా ఉంది. బీజేపీ అత్యాశతో చేస్తున్న ప్రకటనలుగా చెబుతున్నారు. దీని మీద జాతీయ స్థాయిలో డిబేట్లు కూడా జరుగుతున్నాయి. బీజేపీ అన్ని సీట్లు సొంతంగా ఎపుడూ గెలుచుకోలేదు అని అంటున్నారు దానికి అనేక కారణాలు ఉన్నాయి.

దక్షిణ భారత దేశంలో చూస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, తమిళనాడు, కేరళ కలుపుకుని 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో తమిళనాడు 39, కేరళ 20 సీట్లను తీసి పక్కన పెట్టేయాల్సిందే అంటున్నారు. ఇక్కడ బీజేపీ ఒక్క సీటు గెలిచినా అద్భుతమే అని అంటున్నారు.

ఇక కర్నాటకలో 2019లో గెలిచిన అత్యధిక సీట్లను ఈసారి బీజేపీ నిలబెట్టుకుంటే గొప్పే అంటున్నారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. తన ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. అలా కర్నాటకలో బీజేపీ ఇరవై దాకా సీట్లు తెచ్చుకుంటే తెలంగాణాలో గతసారి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి. ఈసారి అవి నిలబెట్టుకుంటే ఓకే అని అంటున్నారు.

ఏపీలో టీడీపీతో పొత్తు వల్ల ఒకటి రెండు ఎంపీ సీట్లు వచ్చినా ఓవరాల్ గా చూస్తే 129 నుంచి బీజేపీకి దక్కేవి పాతిక మించి ఉండవని అంటున్నారు. అలాగే మహారాష్ట్రలో శివసేనతో కలసి గతసారి బీజేపీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఈసారి సీట్లు తగ్గవచ్చు. పశ్చిమ బెంగాల్ లో చూసుకున్నా బీజేపీకి గతసారి వచ్చిన 18 సీట్ల కంటే పెరిగినా ఒకటి రెండు అదనం అవుతాయి తప్ప ప్రభంజనం అయితే ఉండదని అంటున్నారు

ఇక బీహార్ లో గతసారి బీజేపీ స్వీప్ చేసి పారేసింది. ఈసారి అలా కాదు లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమి నుంచి గట్టి పోటీ ఉంటుంది. అయినా మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ఓకే అని చెప్పాలి. ఇలా చూసుకుంటే కనుక పంజాబ్, హమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల సీట్లు బాగా తగ్గుతాయి. ఓవరాల్ చూస్తే బీజేపీకి రామ మందిరం ద్వారా కానీ ఇండియా కూటమి పటిష్టం కాకపోవడం వల్ల కానీ మరోసారి విజయం సాధించేందుకు చాన్స్ ఉండవచ్చు కానీ 370 ఎంపీ సీట్లు సొంతంగా ఎలా వస్తాయన్నది మాత్రం విశ్లేషకులకే అర్ధం కాని పరిస్థితి ఉంది.

అయితే బీజేపీకి 2019లో వచ్చిన 304 ఎంపీ సీట్ల కంటే కొంచెం తగ్గినా సొంత మెజారిటీతో మూడవసారి అధికారంలోకి వస్తే అది అతి పెద్ద విజయంగానే చూడాలని అంటున్నారు అయితే బీజేపీ మాత్రం వై నాట్ 370 సీట్స్ అంటోంది. దాని కోసం ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ నేతలు హాజరవుతున్నారు. ప్రధాన అజెండా ఏంటి అంటే బీజేపీ ఒంటరిగా 370 స్థానాలు గెలిచేలా వ్యూహరచన చేయడమే అంటున్నారు. అలాగే ఎన్డీఏతో కలిసి 400 స్థానాలు గెలిచేందుకు ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. చూడాలి మరి బీజేపీ ఆశ వెనక ఉన్న అజెండా ఏమిటో.