షేర్ మార్కెట్లో టిప్స్ పేరుతో రూ.104 కోట్లు కొల్లగొట్టిన ‘ట్రేడింగ్ క్వీన్’
ఇలాంటివన్నీ పుణికి పుచ్చుకున్న అస్మితా పటేల్ పై తాజాగా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) బ్యాన్ షాకిచ్చింది.
By: Tupaki Desk | 10 Feb 2025 4:56 AM GMTకాసిన్ని మాటలు.. మరికాస్త క్రియేటివిటీ..వీటికి తోడుగా నమ్మినోళ్లను ముంచే హుషారు లాంటి ‘సుగుణాలు’ ఉంటే ఇంకేం? ఇలాంటివన్నీ పుణికి పుచ్చుకున్న అస్మితా పటేల్ పై తాజాగా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) బ్యాన్ షాకిచ్చింది. ఇంతకూ ఆమె చేసిన తప్పేమంటే.. ఒకటా రెండా.. వేలాది మందికి ట్రేడింగ్ లో ఆన్ లైన్ టిప్స్ ఇస్తానని.. తాను ఇచ్చిన సలహాలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేసి భారీగా సంపాదించేయొచ్చన్నమాటలు చెప్పేసి ముంచేసింది. గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆమె మాటల్ని నమ్మేసిన వారు.. ఆమె చెప్పే టిప్స్ ను ఫాలోకావటం.. ఆమె నేర్పే కోర్సుల కోసం భారీగా చెల్లింపులు జరిపారు. అయితే.. అమ్మగారి టిప్స్ ను ఫాలో అయి.. భారీగా నష్టాల్ని చవిచూశారు. దీంతో ఆమెపై సెబీకి పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. టిప్స్ పేరుతో అస్మితా పటేల్ కొల్లగొట్టిన మొత్తం ఎంతో తెలుసా? దగ్గర దగ్గర రూ.104 కోట్లుగా చెబుతున్నారు. మహారాష్ట్రలోని నవీ ముంబయికి చెందిన ఆమె సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన వారిగా చెబుతారు.
తనకు పదిహేడేళ్ల ట్రేడింగ్ అనుభవం ఉందని.. పదేళ్లకు పైగా బోధనా నైపుణ్యం ఉందని చెప్పే ఆమె.. తనకు బోలెడన్ని అవార్డులు వచ్చినట్లుగా చెబుతారు. తన గురించి తాను గొప్పగా చెప్పుకునే తీరుకు పడిపోయిన ఆన్ లైన్ జనాలు ఆమెను సోషల్ మీడియాలోని పలు వేదికల్లో భారీగా ఫాలో అవుతుంటారు. ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్ కు 5.26 లక్షల సబ్ స్కైబర్లు.. ఇన్ స్టాలో 2.9 లక్షల ఫాలోవర్లు.. ఫేస్ బుక్ లో 73వేలు.. లింక్డిన్ లో 1900 మంది.. ఎక్స్ లో 4200 మంది ఫాలోవర్లు ఉన్నారు.
తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటంలో ఆమెకు సాటి రారు. తన గురించి చెప్పుకుంటూ.. ‘‘షీవోల్ప్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్’ గా చెప్పుకుంటారు. అంతేకాదు..ఆప్షన్స్ క్వీన్ గా ప్రచారం చేసుకునే ఆమె.. దాదాపు లక్ష మంది స్టూడెంట్లకు.. పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చింది. ఆమెపై వెల్లువెత్తిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సెబీ ఆమెపై బ్యాన్ విధించటమే కాదు.. కోర్సు ఫీజులకింద వసూలు చేసిన రూ.53 కోట్లు సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. మరేం జరుగుతుందో చూడాలి. చూస్తూ.. చూస్తూ.. అంత భారీ మొత్తాన్ని ఈ టిప్స్ క్వీన్ తిరిగి ఇచ్చేస్తుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.