హిండెన్ బర్గ్ మరో సంచలనం... ఎవరీ మాధవి పురి బచ్?
అవును... తాజాగా అదానీ గ్రూప్ విదేశీ ఫండ్స్ లో సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి తో పాటు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.
By: Tupaki Desk | 11 Aug 2024 5:15 AM GMTఅమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సెబీ ఛైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా... అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్ లలో మాధబి, ఆమె భార్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది.
అవును... తాజాగా అదానీ గ్రూప్ విదేశీ ఫండ్స్ లో సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి తో పాటు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో... అదానీకి చెందిన మారిషస్, ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని వెల్లడించింది.
ఈ సందర్భంగా.. విజిల్ బ్లోయర్ డాక్యుమెంట్స్ ప్రకారం అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని మారిషస్ ఫండ్స్, ఆఫ్ షోర్ బెర్ముడా ఫండ్స్ ఉన్నాయని.. వీటిలో మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ పై నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా పోయాయంటూ కూడా కామెంట్ చేసింది.
ఈ నేపథ్యంలో... మాధబి పుర్, ధావల్ బచ్ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 83 కోట్లు) వరకూ ఉండొచ్చని హిండెన్ బర్గ్ తెలిపింది. అయితే ఈ హిండెన్ బర్గ్ ఆరోపణలపై సెబీ ఇంకా స్పందించలేదు. మరోపక్క ఈ ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.
కారణం... గత ఏడాది జనవరిలో కూడా.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీంతో... అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ సుమారు 150 బిలియన్ డాలర్ల మేర పతనమయ్యాయి! అయితే తిరిగి దాదాపు పూర్వస్థితికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఆరోపణల నేపథ్యంలో సోమవారం మార్కెట్ పై ఆసక్తి నెలకొందని అంటున్నారు.