సెబీ రిపోర్టు: బ్రహ్మచారులకు కలిసి రాని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్
2022-23లో నష్టాల పాలైన వారిలో 75 శాతం పెళ్లి కాని వారు ఉంటే.. పెళ్లైన వారిలో 67 శాతం మంది మాత్రమే నష్టపోయినట్లుగా గుర్తించారు.
By: Tupaki Desk | 27 July 2024 6:24 AM GMTస్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పైన ఇటీవల సెబీ సిద్ధం చేసిన రిపోర్టుకు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. దీని ప్రకారం ఇంట్రా డే ట్రేడింగ్ చేసే వారిలో పెళ్లి కాని వారితో పోలిస్తే.. పెళ్లైన వారు ఎక్కువ లాభాలు పొందుతున్న విషయాన్ని గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఒకే రోజు స్టాకులు కొనటం.. అమ్మటం పూర్తి చేసే ఈ తరహా ట్రేడింగ్ పెళ్లైన వారికే ఎక్కువగా కలిసి వస్తుందన్న విషయాన్ని గుర్తించింది.
ఇంట్రా డే ట్రేడింగ్ లో లాభాల్ని నమోదు చేసే వారి వివరాల్ని విశ్లేషించేందుకు భారీ ఎత్తున డేటాను వడబోసింది సెబీ. ఇందుకోసం 2018-19, 2021-22, 2022-23కుసంబంధించిన వివరాల్ని పరిశీలించిన అనంతమే సెబీ ఈ వ్యాఖ్య చేసినట్లుగా చెబుతున్నారు. తాము చెక్ చేసిన ఈ మూడేళ్లలో పెళ్లైన ట్రేడర్లే ఎక్కువ లాభాలు పొందినట్లుగా గుర్తించారు.
బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లైన వారు లాభాలు పొందిన వైనం ఒక ఎత్తు అయితే.. నష్టాల విషయంలోనూ పెళ్లైన వారు నష్టపోయిన శాతం తక్కువన్న విషయాన్ని గుర్తించారు. 2022-23లో నష్టాల పాలైన వారిలో 75 శాతం పెళ్లి కాని వారు ఉంటే.. పెళ్లైన వారిలో 67 శాతం మంది మాత్రమే నష్టపోయినట్లుగా గుర్తించారు. ఇక.. విశ్లేషించిన మూడేళ్ల డేటాలో మరో ఆసక్తికర అంశాన్ని గుర్తించారు.
పురుషులు.. మహిళల్లో ఆడవారే ఎక్కువ లాభాల్ని ఆర్జించిన విషయాన్ని గుర్తించారు. 2022-23లో రూ.కోటి కంటే ఎక్కువ ఇంట్రాడే టర్నోవర్ ఉన్న పురుషులు రూ.38,570 సగటు నష్టాన్ని నమోదు చేస్తే.. మహిళా ట్రేడర్లు రూ.22,153 నష్టాన్ని మాత్రమే చవి చూసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్ పెళ్లైన వారికి.. మహిళలకు ఎక్కువ లాభాల్ని తెచ్చి పెడుతుందన్న ఆసక్తికర అంశాన్ని సెబీ వెల్లడించింది. సో.. బ్రహ్మచారులు బీ కేర్ ఫుల్.