అమెరికా టు అమృత్ సర్.. రెండో విమానం వచ్చేసింది.. వివరాలివే!
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్.. భారత్ కు రెండో విమానాన్ని పంపించింది.
By: Tupaki Desk | 16 Feb 2025 6:26 AM GMTఅమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్.. భారత్ కు రెండో విమానాన్ని పంపించింది. గతంలో 104 మంది అక్రమ వలసదారులైన భారతీయులను అమృత్ సర్ కు తీసుకొచ్చి అప్పగించిన అమెరికా.. తాజాగా రెండో విడతలో 116 మంది భారతీయ అక్రమ వలసదారులను అమృత్ సర్ కు తీసుకొచ్చింది.
అవును... అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో భారత్ చేరుకుంది. ఇందులో భాగంగా... పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో తొలుత 119 మందిని పంపుతున్నట్లు ప్రకటించినట్లు వార్తలొచ్చినా.. 116 మంది మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు.
ఇక రెండో విడతగా భారత్ చేరుకున్న వారిలో అత్యధికంగా పంజాబ్ కు చెందినవారు 65 మంది ఉండగా.. హర్యానా రాష్ట్రానికి చెందినవారు 33 మంది, గుజరాత్ 8 మంది, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గోవాల నుంచి ఇద్దరేసి చొప్పున.. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని అంటున్నారు.
కాగా... 104 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా నుంచి సీ-17 విమానంలో భారత్ కు తొలివిడతలో పంపించిన సంగతి తెలిసిందే. వీరంతా ఈ నెల 5వ తేదీన అమృత్ సర్ కి చేరుకున్నారు. వారిలో 33 మంది గుజరాత్, 33 మంది హర్యానా, 30 మంది పంజాబ్ వాసులతో పాటు ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు యూపీ, ఇద్దరు చండీగఢ్ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఎయిర్ పోర్ట్ లో దిగిన అనంతరం భారత్ అధికారులు ఈ అక్రమ వలసదరుల డాక్యుమెంట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి.. వారి వారి ప్రాంతాలకు పంపించారు. ఈ సమయంలో వీరిని భారత్ కు తరలించడానికి అమెరికా 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రెండో విమానాన్ని 116 మందితో పంపించింది.