''మేం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో చెప్పండి''
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీలు సీట్లు పంచుకుని పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 April 2024 3:15 AM GMT''మేం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో చెప్పండి''- అని ఏపీలో చేతులు కలిపిన బీజేపీ-జనసేన-టీడీపీల కూటమి ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీలు సీట్లు పంచుకుని పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఉమ్మడిగా ప్రచారం కూడా చేయాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసుకుంటున్నాయి. ఇదిలావుంటే.. కూటమి పార్టీల ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో ఏర్పడితే.. ఏం చేయాలని ప్రజలు భావిస్తున్నారో చెప్పాలని కూటమి ప్రజలకు పిలుపునిచ్చింది.
కూటమి పార్టీల అంచనా ప్రకారం.. ఏపీలో ఈ మూడు పార్టీల కలయికపై ప్రజలకు చాలానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్య ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ప్రజలు ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరుకుం టున్నారు. ఈ విషయం అటు జనసేన అధినేత పవన్ చేపట్టిన వారాహి యాత్రల్లో బయటపడింది. ఇక, చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు యాత్రల్లోనూ ప్రజల ఆకాంక్షలు వినిపించాయి. అదేవిధంగా బీజేపీ నాయకులకు కూడా ఒక అవగాహన ఉంది. అందుకే.. తాము ఉమ్మడిగా కలిసి అధికారంలోకి వస్తే.. ప్రజలు ఏం చేయాలని కోరుకుంటున్నారనేది వారి ప్రశ్న.
ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. కూటమి పార్టీలు ఉమ్మడిగా.. ``మేం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో చెప్పండి`` అని రాష్ట్ర ప్రజలకు తాజాగా పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఒక ఫోన్ నెంబరును కూడా ఇచ్చాయి. 8341130393 నెంబరుకు మిస్డ్‌కాల్, వాట్సాప్, డాక్యుమెంట్, మెసేజ్ రూపంలో ఏదో ఒక విధంగా ప్రజలు తమ ఆకాంక్షలను, సమస్యలను.. తెలపాలని కోరాయి. వీటిని తాము త్వరలోనే ప్రజల ముందు ఉంచనున్న మేనిఫెస్టోలో ఉమ్మడిగా పేర్కొంటామని ఆయా పార్టీల నాయకులు తెలిపారు. తాజాగా విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు.. భేటీ అయి.. మేనిఫెస్టోపై చర్చించారు. ఈ క్రమంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని... ఆ తర్వాత మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ నెంబరును అందుబాటులోకి తెచ్చారు.