వెలకట్టలేని సంపద... పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్!?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా... పూరీ జగన్నాథుడి రత్న భాండాగరంపై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 July 2024 5:46 AM GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా... పూరీ జగన్నాథుడి రత్న భాండాగరంపై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భాండాగారాన్ని తెరిపించిన ప్రభుత్వం దాని రిపేర్లు, ఖజానా లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ భాండాగారానికి సంబంధించిన షాకింగ్ సీక్రెట్ ఒకటి చెబుతున్నారు చరిత్రకారులు. ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది.
అవును... ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా గతంలో ఈ సంపదను లెక్కించడానికి ఏకంగా 70 రోజుల సమయం పట్టిందని.. అప్పటికీ ఇంకా లెక్కించాల్సింది మిగిలే ఉందని అంటున్న నేపథ్యలో.. అసలు లోపల ఎంత సంపదుందో అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో రహస్య గది టాపిక్ తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... పూరీ జగన్నాథుని రత్న భాండాగారం కింద ఓ రహస్య గది ఉందని.. ఆ గదికి సొరంగ మార్గం గుండా వెళ్లాలని.. అలా వెళ్లగలిగితే అక్కడ మరింత విలువైన సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదే సమయంలో... భాండాగారం తెరిచిన ప్రభుత్వం.. ఈ సొరంగ మార్గం, సీక్రెట్ రూం లను గుర్తించడంపైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఇదో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్ మిశ్రా... తూర్పు, దక్షిణాది రాష్ట్రాలను జయించిన అనంతరం పూరీ రాజు కపిలెంద్రదేవ్ భారీ సంపద తెచ్చి జగన్నాథునికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని అన్నారు. అప్పట్లోనే భాండాగారం కింద సొరంగ మార్గం తవ్వి, ఆభరణాలను భద్రపరచడానికి రహస్య గదిని నిర్మించారని అన్నారు.
ఈ రహస్య గదిలో సుమారు 34 కిరీటాలు, రత్నాలతో పొదగబడిన బంగారు సింహాసనాలు, స్వర్ణ విగ్రహాలు, వడ్డాణాలు ఉన్నాయని.. ఆ సంపద వెలకట్టలేనిదని వెల్లడించారు. ఇదే సమయంలో... ముస్లిం దండయాత్రల సమయంలో స్వామిపారి సంపద దోపిడీకి గురవ్వకుండా ఈ రహస్య గదిని నిర్మించారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేశ్ చంద్రదాస్ పేర్కొన్నారు.
ఈ రహస్య గదికోసమే 1902లో బ్రిటీష్ పాలకులు ఆ సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపిస్తే అతడి ఆచూకీ తెలియలేదని.. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని అన్నారు. అనంతరం ఈ రహస్యగది, సొంరంగ మార్గం గురించి ఎవరూ కనుగొనలేకపోయారని వెల్లడించారు. ఇప్పుడు ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఒడిశా సర్కార్ ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి!