Begin typing your search above and press return to search.

అదేం ఖర్మో.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడో ఇలాంటివి జరుగుతాయి!

పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో తెర మీదకు వచ్చే కొన్ని ఉదంతాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

By:  Tupaki Desk   |   7 April 2025 4:30 AM
అదేం ఖర్మో.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడో ఇలాంటివి జరుగుతాయి!
X

పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో తెర మీదకు వచ్చే కొన్ని ఉదంతాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా క్రిష్ణా జిల్లా ముప్పాళ్ల గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెలుగు చూసిన భద్రతా వైఫల్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి వద్దకు ఎవరు పడితే వాళ్లు రావటం.. ఒకరైతే ఏకంగా కాళ్ల మీద పడిపోవటం.. వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఉండటం లాంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.

దేశంలోనే కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పిస్తున్న నేతల్లో చంద్రబాబు ఒకరు. అలాంటి నేత పర్యటనకు వస్తున్నప్పుడు భారీ బందోబస్తు చాలా అవసరం. ప్రతి ఒక్కరి కదలికల మీద ప్రత్యేక నిఘా ఉంటుంది. అందుకు భిన్నంగా చంద్రబాబు పర్యటన వేళలో మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేని వారు సైతం వచ్చి ముఖ్యమంత్రితో ఫోటోలు దిగటం.. ఒక గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కూడా సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి.. కాళ్ల మీద పడటం గమనార్హం. అంతటి అవకాశం ఎలా ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. నిజానికి హెలిప్యాడ్ వద్దకు ఎవరిని అనుమతించాలి? అన్న దానిపై కసరత్తు జరిగి ఒక జాబితాను తయారు చేశారు.అయితే.. అందుకు విరుద్ధంగా పలువురు రావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేకున్నా ఎందుకు అనుమతించారు? దీనికి కారణం ఏమిటి? లాంటి అంశాల మీద నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రతా లోపాలకు కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది.