ఎన్‌కౌంటర్: పట్టుబడిన వారినీ మట్టు బెట్టారా?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ - నారాయణపూర్ జిల్లాల మధ్య ఉన్న దండకారణ్యంలో రక్తం పొంగి పొర్లింది.
By: Tupaki Desk | 5 Oct 2024 4:03 AM GMTఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ - నారాయణపూర్ జిల్లాల మధ్య ఉన్న దండకారణ్యంలో రక్తం పొంగి పొర్లింది. మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో 42 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎన్ కౌంటర్‌గా వారు పేర్కొనడం గమనా ర్హం. అయితే.. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని కమ్యూనిస్టు పార్టీల నాయకులు, ఉద్యమ కారులు, సానుభూతిపరులు, హక్కుల సంఘాల నాయకులు చెబుతు న్నారు. తమకు పట్టుబడిన వారిని కూడా పోలీసులు మట్టుబెట్టారన్నది వారి ఆరోపణ.
మరోవైపు దంతెవాడ, నారాయణపూర్, దండకారణ్యం ప్రాంతాల్లోని గిరిజనులు కూడా కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. వీరిలో పదుల సంఖ్యలో పోలీసు కాల్పుల్లో మరణించారన్న కథనాలు కూడా హల్చల్ చేస్తున్నాయి. బస్తర్ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్ దండకారణ్యంలోని తుల్‌తులి, నెందూర్ గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
గంట గంటకు చనిపోయిన వారి సంఖ్య పెరుగుతుండడం.. గ్రామస్తులు కూడా అందుబాటులో లేక పోవడంతో ఈ ఎన్ కౌంటర్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మాత్రం చనిపోయిన వారంతా కూడా మావోయిస్టులేనని.. పక్కా సమాచారంతోనే తాము ఇక్కడ ఆపరేషన్ చేపట్టినట్టు వివరించారు. వాస్తవానికి ప్రస్తుతం మావోయిస్టులు తలోదిక్కుగా ఉన్నారు. పైగా దంతెవాడలో కేంద్రం పహారా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోటకు అంత మంది ఎలా వస్తారన్నది ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలోనే తాజా ఎన్ కౌంటర్ సహా 42 మందికి పైగా మృతి చెందారన్న వార్తలు అసామాన్యంగా ఉన్నాయన్నది కమ్యూనిస్టు నాయకులు, మావోయిస్టు సానుభూతిపరులు చెబుతున్న మాట. ఇదిలావుం టే .. ఇంత పెద్ద ఎన్ కౌంటర్ జరిగినప్పుడు అటు వైపు పక్షమే దెబ్బతినడం.. ఇటు వైపు పోలీసులకు చిన్న గాయాలు కూడా కాకపోవడం వంటివి కూడా మరింతగా అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. మావోయిస్టులను, వారి సిద్ధాంతాలను ఎవరూ సమర్థించకపోయినా.. జరిగిన భారీ ఎన్ కౌంటర్ వెనుక `ఏదో` జరిగిందన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట. ముఖ్యంగా హక్కుల సంఘాలు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.