ఉగ్రముప్పు.. చాంపియన్స్ ట్రోఫీ కొనసాగేది అనుమానమేనా?
ఈ మేరకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికలతో అంతటా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 24 Feb 2025 1:30 PM GMTపాకిస్తాన్ అంటేనే అల్లకల్లోలం.. అశాంతి.. ఉగ్రవాదంతో ఎప్పుడూ బాంబు పేలుళ్లతో సతమతయ్యేది. గత 20 ఏళ్లుగా ఇదే సాగుతోంది. అయితే పాక్ ప్రధాని పట్టుబట్టి మరీ ఈసారి ఓ ఐసీసీ టోర్నీని పాకిస్తాన్ లో నిర్వహించాలని మొండిపట్టు పట్టాడు. అయితే ఇండియా భద్రతా కారణాలతో పాకిస్తాన్ వెళ్లలేదు. దుబాయ్ లో ఆడుతోంది. అయితే చాంపియన్స్ ట్రోఫీలో తొలిదశ మ్యాచులు ముగిసిన నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు వచ్చిపడింది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికలతో అంతటా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా? లేదా? అన్న ఆందోళన నెలకొంది.
1996లో వన్డే వరల్డ్ కప్‌ను నిర్వహించిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల అనంతరం పాకిస్తాన్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తోంది. అయితే భద్రతా కారణాల వల్ల భారత్ ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌లో ఆడేందుకు అంగీకరించలేదు. దుబాయ్‌లో తటస్థ వేదికపై భారత జట్టు తన మ్యాచ్లు ఆడేలా ఏర్పాట్లు జరిగాయి.
- భద్రతా ముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో, మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. అదే విధంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై, ఈ టోర్నమెంట్ నుంచి ముందుగానే నిష్క్రమించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు టోర్నమెంట్‌ను టార్గెట్ చేసే ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందని గుర్తించాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరైన విదేశీయులను అపహరించేందుకు ఉగ్రవాద గ్రూపులు పథకాలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో తెహరిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP), ISIS, బాలూచిస్తాన్ గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నాయని అక్కడి మీడియా తెలిపింది. దీనితో పాటు, భద్రతా పరిస్థితులపై పాకిస్తాన్ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.
- పాకిస్తాన్‌లో గతంలో జరిగిన ఘటనలు
2008లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు, ఉగ్రవాదులు వారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటన తర్వాత పాకిస్తాన్‌లో ఐసీసీ టోర్నమెంట్లు నిర్వహించలేదు. కొంత కాలానికి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించాయి. అయితే, భద్రతా సమస్యలతో కొన్నిసార్లు ఆ జట్లు పర్యటనను అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది.
- భద్రతా ఏర్పాట్లు.. పాక్ చర్యలు?
13,000 మంది భద్రతా సిబ్బందిని మొహరించి ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యంత కఠిన భద్రతను కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆటగాళ్ల బస ప్రాంతం నుంచి మైదానం వరకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కానీ, తాజా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.