Begin typing your search above and press return to search.

ఔరంగజేబు సమాధి వద్ద భద్రత పెంపు... అసలేం జరిగింది?

ఇటీవల విడుదలైన సంచలన చిత్రం "ఛావా" సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   17 March 2025 5:57 PM IST
ఔరంగజేబు సమాధి వద్ద భద్రత పెంపు... అసలేం జరిగింది?
X

ఇటీవల విడుదలైన సంచలన చిత్రం "ఛావా" సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే! ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరత్వంతో పాటు ఔరంగజేబు రాక్షసత్వం, కౄరత్వం స్పష్టంగా చూపించారు! ఈ సమయంలో ఔరంగజేబు చరిత్ర మరోసారి చర్చకు వచ్చింది. మరోపక్క.. ఔరంగజేబు సమాధి కూల్చేయాలన్న డిమాండ్ తో సెక్యూరిటీని పెంచారు.

అవును... మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్లు వస్తున్న వేళ.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సమయంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు.. సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఎవరైనా సమాధి వద్దకు వెళ్లాలనుకుంటే.. గుర్తింపు పత్రాలు చూపించి, రిజిస్టర్ లో సంతకాలు చేయాలని అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చేయాల్సిందే అంటూ విశ్వహిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టింది. ఇదే సమయంలో అధికారులకు మెమోరాండాలను సమర్పించింది. అంతేకాకుండా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇచ్చిన మెమోరాండంలో పలు విషయాలను ప్రస్థావించింది.

ఇందులో భాగంగా... మత మార్పిడికి నిరాకరించారన్న నెపంతో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ఇద్దరు తనయులను ఔరంగజేబు దారుణంగా హత్య చేశారని.. ఛత్రపతి శంభాజీ మహారాజ్ ను కౄరంగా హింసించి చంపడంతో పాటు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని ఆ మెమోరాండంలో పేర్కొన్నారు. అందువల్ల ఔరంగజేబు సమాధిని కూల్చేయాల్సిందేనని కోరారు.

ఈ సందర్భంగా... ఔరంగజేబు స్మారక చిహ్నం ఏదైనా సరే అది బాధ, బానిసత్వానికి చిహ్నమని.. అలాంటి చిహ్నాలు ఉండకూడదని.. అందువల్ల ఆ సమాధిని పూర్తిగా కూల్చేయాలని ముఖ్యమంత్రికి ఇచ్చిన మెమోరాండంలో కోరారు. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే ఆ పనికి పూనుకుంటామని హెచ్చరించారు.

దీంతో... మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ సమయంలో ఔరంగజేబు సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శంభాజీనగర్ రూరల్ పోలీసులతోనూ భద్రతను పెంచారు. దీంతో... ప్రస్తుతం అక్కడ సందర్శకుల తాకిడి తగ్గింది!