చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై నివేదిక కోరిన కేంద్రం
By: Tupaki Desk | 4 Aug 2023 10:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనలో కొందరు వైసీపీ కార్యకర్తలు సభావేదిక దగ్గరకు వచ్చి గందరగోళం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ వినుకొండ సమీపంలో పాదయాత్ర చేస్తుండగా వందలాది మంది జనం ఒక్కసారిగా వచ్చి లోకేష్ పై పడేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రను ఆపేయాల్సి వచ్చింది. ఇక, తాజాగా నేడు అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడి, పుంగనూరులో పర్యటించకుండా చంద్రబాబును అడ్డుకోవడం వంటి ఘటనలు రాజకీయ దుమారం రేపాయి. గత ఏడాది నవంబరులో చంద్రబాబు రోడ్ షోలో రాళ్ల దాడితో మొదలైన ఈ పరంపర తాజాగా పుంగనూరు వరకు కొనసాగింది.
ఇలా జడ్ క్యాటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు, టీడీపీ అగ్రనేత లోకేష్ ల పర్యటనలో తరచుగా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారాలపై కేంద్రం దృష్టి సారించింది. చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్ర హోంశాఖ కోరింది. గత ఏడాది నవంబరులో రాళ్లదాడి ఘటనపై వివరాలు అందించాలని ఆదేశించింది. చంద్రబాబు, లోకేష్ ల పర్యటనల సమయంలో తగిన భద్రత కల్పించాలని ఏపీ డీజీపీకి, సీఎస్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం జులై చివరి వారంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబు, లోకేష్ ల పర్యటనల్లో ఆ తరహా ఘటనలు జరగడంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చేసిన ఫిర్యాదు తో కేంద్ర హోంశాఖ స్పందించింది. అగ్రనేతలకు భద్రత కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని కనకమేడల ఫిర్యాదులో ఆరోపించారు.