Begin typing your search above and press return to search.

'రాజద్రోహం' పై జ్ఞానోదయం అయ్యిందా ?

అయితే ఏ ప్రభుత్వమూ సుప్రింకోర్టు ఆదేశాలను లెక్కచేయలేదు. మొత్తానికి కేంద్రప్రభుత్వం ఏమనుకున్నదో ఏమో రాజద్రోహం చట్టాన్ని రద్దుచేసేసింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 6:00 AM GMT
రాజద్రోహం పై జ్ఞానోదయం అయ్యిందా ?
X

బాగా దుర్వినియోగం అవుతున్న చట్టాల్లో రాజద్రోహం చట్టం ముందుంటుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవరేమి మాట్లాడినా పాలకులకు ముందుగా గుర్తుకొచ్చేది రాజద్రోహం చట్టమే. గడచిన పదేళ్ళుగా దేశవ్యాప్తంగా కొన్ని వేలమందిపైన ప్రభుత్వాలు రాజద్రోహం కేసులు నమోదుచేసుంటాయనటంలో సందేహంలేదు.

రాజద్రోహం కేసులు నమోదుచేయటంలో కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళపైన, ప్రభుత్వానికి వ్యతిరేకంగ మాట్లాడుతున్న వాళ్ళపైన, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న వాళ్ళపైన కూడా ప్రభుత్వాలు రాజద్రోహం కేసులు నమోదు చేస్తున్నాయి.

ఈ తరహా కేసులు బాగా నమోదవుతుండటంతో కోర్టులు కూడా సీరియస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజద్రోహం కింద కేసు నమోదుచేస్తే వెంటనే సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు పంపేస్తున్నారు. ఈ కేసులో అరెస్టయితే బెయిల్ దొరకటం కూడా కష్టంగానే ఉంటోంది. ఇదే విషయమై కొందరు వివిధ హైకోర్టుల్లోను, సుప్రింకోర్టులో కూడా కేసులు వేశారు. దాంతో కేసులపై విచారించిన సుప్రింకోర్టు రాజద్రోహం కేసును ఎవరిపైనా నమోదుచేయద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

అయితే ఏ ప్రభుత్వమూ సుప్రింకోర్టు ఆదేశాలను లెక్కచేయలేదు. మొత్తానికి కేంద్రప్రభుత్వం ఏమనుకున్నదో ఏమో రాజద్రోహం చట్టాన్ని రద్దుచేసేసింది. నిజానికి రాజద్రోహం చట్టాన్ని బ్రిటీష్ పాలకులు తీసుకొచ్చారు. అప్పట్లో వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని శిక్షించటమే కానీ వాళ్ళకు న్యాయంచేయటంకాదు. బ్రిటీష్ వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు తయారుచేసిన చట్టాలు మాత్రం అలాగే కంటిన్యు అవుతున్నాయి.

ఇదే విషయాన్ని గతంలోనే సుప్రింకోర్టు చెప్పి చట్టాలను ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్రప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగానే రాజద్రోహం చట్టాన్ని ఎవరిపైనా నమోదు చేయద్దని చెప్పింది. అయితే అప్పట్లో సుప్రింకోర్టు ఆదేశాలను లెక్కచేయని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇంత సడెన్ గా రాజద్రోహం చట్టాన్ని రద్దుచేసింది. మరి ఈ చట్టాన్ని ఎందుకు రద్దుచేసిందో మోడీకే తెలియాలి. ఎందుకంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయటంలో మోడీ ప్రభుత్వమే ముందుంది. ఏదేమైనా రాజద్రోహం చట్టం రద్దవటం సంతోషమే కదా.