Begin typing your search above and press return to search.

సీమాంధ్ర ఓట్ల మీద కేటీయార్ సంచలన కామెంట్స్...!

సీమాంధ్రులు హైదరాబాద్ లో చాలా ఎక్కువగానే ఉన్నారు. వారిని సెటిలర్స్ అని అంటారు. సంక్రాంతి పండుగ వస్తే చాలు హైదరాబాద్ ఎంతలా బోసి పోతుందో అందరికీ ఎరుకే

By:  Tupaki Desk   |   16 Oct 2023 3:56 AM GMT
సీమాంధ్ర ఓట్ల మీద కేటీయార్ సంచలన కామెంట్స్...!
X

సీమాంధ్రులు హైదరాబాద్ లో చాలా ఎక్కువగానే ఉన్నారు. వారిని సెటిలర్స్ అని అంటారు. సంక్రాంతి పండుగ వస్తే చాలు హైదరాబాద్ ఎంతలా బోసి పోతుందో అందరికీ ఎరుకే. అంతలా హైదరాబాద్ నిండా ఉన్న సీమాంధ్రులు తమ ఉనికితో 28 నుంచి ముప్పయి నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు అని అంటున్నారు.

గత రెండు ఎన్నికల్లో బీయారెస్ ని సపోర్ట్ చేసిన సీమాంధ్రులు ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారు అని మొదటి నుంచి వినిపిస్తున్న మాట. దానికి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కూడా తోడు అయింది. సీమాంధ్రులలో ఒక బలమైన సామాజికవర్గం ఓట్లు కట్ట కట్టుకుని మరీ కాంగ్రెస్ కి పడతాయని ప్రచారం అయితే ఉంది. దానికి తోడు బాబుకు మద్దతుగా హైదరాబాద్ లో ఆందోళనలు చేయవద్దని అవసరం అయితే రాజమండ్రిలో భూమిని బద్ధలు కొట్టాలని కేటీయార్ ఈ మధ్యనే కీలక కామెంట్స్ చేశారు.

దాంతో ఆ వర్గం బాగా నొచ్చుకుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో బీయారెస్ కూడా కేటీయార్ కామెంట్స్ మీద కొంత రిపేర్ చేసుకుంది. బీయారెస్ మంత్రులు సహా చాలా మంది చంద్రబాబు అరెస్ట్ మీద తమ సానుభూతిని చూపించారు. ఈ నేపధ్యంలో సీమాంధ్రుల ఓట్ల కోసం మూడు ప్రధాన పార్టీలు ఎవరి మటుకు వారు ప్రయత్నం చేసుకుంటున్నాయి.

ఇక ఇంతకీ సీమాంధ్రుల ఓట్లు ఎటు వైపు అన్న ప్రశ్న అయితే ఉండనే ఉంది. దాని మీద రకరకాలైన ఊహాగానాలు ఉన్నా అనీ గుత్తమొత్తంగా ఒకే పార్టీకి పడతాయంటే కూడా అది కుదిరే వ్యవహారమా అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపధ్యంలో కేటీయార్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ మీద మాకు సానుభూతి ఉంది. దానిని తగ్గించేలా టీడీపీ నేతలు తమ మీద విమర్శలు చేయవద్దు అని గట్టిగానే చెప్పడం విశేషం.

అంతే కాదు, తాము ధర్నాలు చేయవద్దు, బాబుకు మద్దతుగా నిరసనలు వద్దు అని ఎక్కడా చెప్పలేదని ఆయన అంటున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ నిరసనలు చేసి ప్రజా జీవితాన్ని ఇబ్బందులలోకి నెట్టకుండా ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేసుకోవచ్చు అని ఆయన అంటున్నారు. ఇక సీమాంధ్రుల పూర్తి మద్దతు తమకే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీలోనే కుల గజ్జి గట్టిగా ఉంటుంది తప్ప తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉండదని కూడా కేటీయార్ అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అన్నది ఏపీలో రెండు పార్టీల మధ్య ఉన్న వివాదంగానే ఆయన చూస్తున్నరు. దాన్ని తీసుకుని వచ్చి తెలంగాణా మీద రుద్దాలంటే అసలు కుదిరే పని కాదని అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసు అని ఎవరేమిటి అన్నది వారు బాగా ఆలోచించే కీలకమైన నిర్ణయం తీసుకుంటారని కేటీయార్ అన్నారు. మొత్తానికి సీమాంధ్రుల ఓట్ల విషయంలో బీయారెస్ నిబ్బరంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.