Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ అరెస్ట్‌ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

దీంతో ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై తాజాగా మంత్రి సీతక్క స్పందించారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 9:36 AM GMT
అల్లు అర్జున్ అరెస్ట్‌ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!
X

సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానూ సంచలనంగా మారింది. అరెస్ట్ చేయడం.. ఎంక్వయిరీ చేయడం.. మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సి రావడంతో అభిమానులంతా నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై తాజాగా మంత్రి సీతక్క స్పందించారు.

ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పొలిటికల్ పరంగానూ దుమారం రేపింది. పాలిటిక్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెట్టారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. అల్లు అర్జున్‌కు అనుకూలంగా.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేయడం ప్రారంభించారు. ఇదే క్రమంలో అటు బీజేపీ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు సైతం అల్లు అర్జున్ ‌అరెస్టుపై స్పందించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఓ హీరోను ఇలా నిర్దాక్షిణ్యంగా.. ఆయనకు సంబంధం లేని విషయంలో అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రభుత్వం అలసత్వం కారణంగానే థియేటర వద్ద ఈ ఘటన జరిగిందని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకొచ్చారు. తాను కానీ.. తన మంత్రులు కానీ ఈ కేసులో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. పోలీసులు చట్టప్రకారమే నడుచుకుంటున్నారని వెల్లడించారు. చట్టం ఎవరికీ అనుకూలం కాదని.. చట్టం ప్రకారమే పోలీసులు వ్యవహరించాలని అన్నారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వంపై ట్రోల్స్ మరిన్ని ఎక్కువ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించారు.

తాజాగా.. ఇదే విషయమైన మంత్రి సీతక్క సైతం స్పందించారు. అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. ఆయన అరెస్టు ప్రక్రియ చట్టానికి లోబడే జరిగిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. ఎవరం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అల్లు అర్జున్ భార్య సీఎం రేవంత్ రెడ్డికి బంధువులే అవుతారని, మెగాస్టార్ చిరంజీవి సైతం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని తెలిపారు. కక్ష పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ.. కాంగ్రెస్ నేతలకు కానీ లేదని వివరించారు.