మంత్రిని అయ్యాక కూడా నా తల్లిదండ్రులు రోజూ అడవికి పనికి వెళతారు
బట్ట కాల్చి మీద పడేసే బ్యాచ్ కొందరుంటారు. అలాంటి వారు ఎదుటోళ్లు ఎవరు? వారి తీరు ఏమిటన్న దాన్ని పట్టించుకోరు.
By: Tupaki Desk | 31 July 2024 5:30 AM GMTబట్ట కాల్చి మీద పడేసే బ్యాచ్ కొందరుంటారు. అలాంటి వారు ఎదుటోళ్లు ఎవరు? వారి తీరు ఏమిటన్న దాన్ని పట్టించుకోరు. ఎవరిపైనైనా సరే ఆరోపణలు చేసేస్తుంటారు. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించి అడ్డంగా బుక్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క తండ్రికి గత ప్రభుత్వం పోడు పట్టా ఇచ్చిందన్న అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీతక్క.. తాను అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా ఈ రోజుకు వారి రెక్కల కష్టమ్మీద కష్టపడుతున్నారన్నారు.
ప్రతిరోజు అడవికి వెళ్లి పని చేస్తుంటారన్న ఆమె.. ‘‘నా తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతరు. ఇప్పటికి నా తండ్రి అడవిని నమ్ముకొని రోజు పని చేస్తడు’’ అంటూ సీరియస్ అయ్యారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హత ఉన్నందుకే తన తండ్రి పేరు మీద ఎకరం 17 గుంటల భూమికి హక్కు పట్టా వచ్చిందని.. తన కుటుంబానికి ఎవరూ దానం ఇవ్వలేదన్నారు.
అడవే ఆధారంగా బతికే కుటుంబాలు తమవి అన్న ఆమె.. తాను ఆదివాసీ అయినందుకు తన తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాపై బీఆర్ఎస్ నేతు పదే పదే విమర్శిస్తున్నారన్నారు. పోడు భూముల హక్కుల కోసం తన తండ్రి పోరాడి.. జైలుకు కూడా వెళ్లి వచ్చారని.. తాను మంత్రిగా ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికి అడవిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తారంటూ సీతక్క వెల్లడించారు.
2018లో తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఐదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించని వైనాన్ని గర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను కోర్టును ఆశ్రయించానని చెప్పిన మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతోమంత్రి ప్రజాప్రతినిదులు రైతుబంధు తీసుకున్నారన్నారు. పోడు భూముల చట్టంతో ఎస్టీలకు లబ్థి చేకూరిందన్న సీతక్క.. దాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.