ప్రొక్లెయిన్ తో లిక్కర్ బాటిల్ పగలగొడుతున్న వేళ ప్రాణం పోయినంత పనైంది
మొత్తం 24,031 బాటిళ్లను వరుసగా పేర్చారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డు వద్ద మద్యం సీసాల్ని ధ్వంసం చేయటం షురూ చేశారు.
By: Tupaki Desk | 10 Sep 2024 4:50 AM GMTరోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది. కళ్ల ముందు వేలాది మందు బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తున్న వేళ.. ప్రాణం ఒప్పుకోని పలువురు మందుబాబులు.. పోలీసులను వదిలించుకొని మరీ.. మందు బాటిళ్లను ఎత్తుకెళ్లిపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలో పోలీసులకు ఇవ్వవాల్సిన మర్యాదను ఇస్తూ.. సార్.. చూస్తూ ఊరుకోలేకపోతున్నాం సార్ అంటూ ముందు ఒక సార్.. చివర్లో మరో సార్ ను పెట్టి మరీ అందిన కాడికి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఎన్నికల వేళ తనిఖీలు నిర్వహించటం.. ఆ సందర్భంగా అక్రమంగా దాచి ఉంచే మద్యం సీసాల్ని స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. ఆ రీతిలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని తాజాగా చేపట్టారు గుంటూరు పోలీసులు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న రూ.50లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మొత్తం 24,031 బాటిళ్లను వరుసగా పేర్చారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డు వద్ద మద్యం సీసాల్ని ధ్వంసం చేయటం షురూ చేశారు. వేలాది మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మందుబాబులు అక్కడకు చేరుకున్నారు. ఎప్పటిమాదిరి రోడ్ రోలర్ కాకుండా మద్యం బాటిళ్లను ధ్వంసం చేయటానికి ప్రొక్లెయిన్ తీసుకొచ్చారు. దీంతో.. మద్యం బాటిళ్లను పగలగొట్టి ధ్వంసం చేయటానికి ఎక్కువ సమయం పట్టింది.
దీంతో.. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే కార్యక్రమం ఆలస్యమైంది. ఈ కారణంగా పోలీసు ఉన్నతాధికారులు మధ్యలోనే వెళ్లిపోయారు. వారు అలా వెళ్లగానే.. అక్కడే ఉన్న పలువురు మందుబాబులు గుంపులుగా ఒక్కసారిగా మద్యం బాటిళ్ల మీద పడిపోయారు. నామమాత్రంగా ఉన్న పోలీసుల్ని సార్.. సార్.. ఇలా పగలగొడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాం సార్.. అంటూ చేతికి అందినన్ని బాటిళ్లను పట్టుకొని ఉడాయించేశారు. ఎక్కువ మంది మందుబాబులు రావటంతో అక్కడున్న పోలీసులు వారిని కంట్రోల్ చేయటానికి నానా తిప్పలు పడ్డారు. ఆ సమయంలోనే మందు బాటిళ్లు తీసుకొని జంప్ అయ్యారు.