ఇక కత్తితో కోయకుండానే పోస్టుమార్టం!
ఎవరైనా హత్యకు గురయినా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదాల్లో మృతిచెందినా పోస్టుమార్టం చేస్తారనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jun 2024 11:30 PM GMTఎవరైనా హత్యకు గురయినా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదాల్లో మృతిచెందినా పోస్టుమార్టం చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందుకోసం మృతుల శరీర భాగాలను వైద్యులు కోస్తారు. సహజంగా మృతుల కుటుంబ సభ్యులు పోస్టుమార్టానికి ఇష్టపడరు. ఎలాపడితే ఇష్టానుసారం శరీరాన్ని కత్తులతో కోసేస్తారని పోస్టుమార్టంకు అంగీకరించరు. అయితే ఎలా మృతి చెందారో తెలుసుకోవాలన్నా, అసలు మృతి కారణం ఏంటో వెల్లడి కావాలన్నా పోస్టుమార్టం చేయకతప్పదు.
ప్రస్తుతం పోస్టుమార్టం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. పోస్టుమార్టం చేయడానికి కనీసం నాలుగైదు గంటల సమయం పడుతోంది. మళ్లీ దాని నివేదిక రావడానికి ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పడం లేదు. పోస్టుమార్టం ప్రక్రియలో వైద్యులు.. మృతుల ఛాతీ, కడుపు, మెడ, పుర్రె భాగాలను తెరవాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా మృతదేహంపై 90 శాతం గాయాలను నిర్ధారిస్తారు.
ఈ నేపథ్యంలో కత్తిగాటు లేకుండా పోస్టుమార్టం ప్రక్రియ అందుబాటులోకి వస్తోంది. కత్తిగాట్లు లేకుండానే వర్చువల్ అటాప్సీ విధానంలో పోస్టుమార్టం చేసే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. ఈ వర్చువల్ అటాప్సీ విధానంలో త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఇలా అందజేసే నివేదికలు కూడా న్యాయపరంగానూ చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నారు.
ఇప్పటికే దిల్లీ, రిషికేశ్, నాగపూర్ ఎయిమ్స్‌ల్లో వర్చువల్ అటాప్సీ విధానం అమలవుతోంది. సీటీ, ఎమ్మారై, త్రీడీ ఫొటోగ్రామ్మెట్రీ సాంకేతికత గల యంత్రం ద్వారా చేసే వర్చువల్ అటాప్సీ ప్రక్రియ అరగంటలో పూర్తవుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ సీటీ, ఎమ్మారై స్కానింగ్ మాదిరిగానే ఈ విధానంలో పరీక్షిస్తారని అంటున్నారు. శరీర అవయవాలను అన్ని కోణాల్లోంచి పరిశీలించేలా ఈ వర్చువల్ అటాప్సీ ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు. కంటితో చూడలేని అంతర్గత రక్తస్రావం, అసాధారణ గాయాలను ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు.
ఈ మేరకు వర్చువల్ అటాప్సీ లేదా డిజిటల్ అటాప్సీ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. వర్చువల్ అటాప్సీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రాల్లోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను కేంద్రం సమకూర్చనుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అమర్చడానికి రూ.2 కోట్ల వరకు వ్యయం అవుతుందని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా అందిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముందుగా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం బోధనాస్పత్రుల్లో వర్చువల్ అటాప్సీ విధానాన్ని ప్రవేశపెడతారని చెబుతున్నారు.
కత్తిగాట్లతో చేసే పోస్టుమార్టంను నివారించడానికి దేశమంతా వర్చువల్ అటాప్సీని ప్రవేశపెట్టడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎయిమ్స్ రిషికేశ్ లో ప్రత్యేకంగా డీఎం–ఫోరెన్సిక్ రేడియాలజీ అండ్ వర్చువల్ అటాప్సీ కోర్సును అందిస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ లో ఎండీ చేసినవారు ఈ కోర్సుకు అర్హులు. ఈ కోర్సును మరిన్ని సంస్థల్లో ప్రారంభించాలని నిర్ణయించింది.