రోజా సీట్లోకి సెల్వమణి రానున్నాడా...?
ఇపుడు రోజాకి టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు ఓ వైపు చెబుతూంటే జనసేన కూడా తమకు బలం ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 17 Aug 2023 3:00 AM GMTనిజంగా ఇది షాకింగ్ న్యూస్ గానే చూడాలని అంటున్నారు. ఆర్కే రోజా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆమె నగరి నుంచి 2014, 2019లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా వరసగా గెలిచారు. 2024లో ఆమె గెలుపు మీద అనుమానాలు చాలా ఉన్నాయి. ఇక రోజా ఉన్న నగరిలో టీడీపీ బాగానే పుంజుకుంది. అక్కడ గాలి ముద్దు క్రిష్ణమనాయుడు కుటుంబానికి బలం ఉంది.
గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని కొత్తగా దూసుకుని వస్తోంది సైకిల్ పార్టీ. గాలి కుమారుడు భాను ప్రకాష్ జనంలో కలియతిరుగుతున్నారు. టీడీపీ సర్వేలలోనే కాదు వైసీపీ సర్వేలలో కూడా నగరిలో రోజాకు ఇబ్బంది అని వస్తోంది. దాంతో టీడీపీ హుషార్ చేస్తోంది.
ఇక రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో ప్రత్యర్థులు తయారయ్యారు. ఆమె మాత్రం మినిస్టర్ గా ఉంటూ అటు చంద్రబాబు ఇటు పవన్ ల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమె హాట్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆమె సొంత నియోజకవర్గంలో గెలించేందుకు ఇవి సరిపోతాయా అంటే అక్కడ సీన్ మొత్తం రివర్స్ లో ఉంది అని అంటున్నారు.
ఇక ఆమె గతంలో రెండు సార్లు పోటీ చేసి గెలిచినా మెజారిటీలు కూడా తక్కువగా వచ్చాయని అంటున్నారు. 2014లో గాలి ముద్దు క్రిష్ణమనాయుడు మీద జస్ట్ 858 ఓట్ల తేడాతోనే బయటపడ్డారు. ఇక 2019లో అంటే జగన్ వేవ్ బాగా ఉన్న టైం లో ఆమె నగరిలో గాలి భాను ప్రకాష్ మీద రెండు వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 77 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదే 2014లో 73 వేల ఓట్లు వచ్చాయి. అంటే కచ్చితంగా బలంగా టీడీపీ ఉంది అని లెక్క వేసుకోవాలి.
ఇపుడు రోజాకి టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు ఓ వైపు చెబుతూంటే జనసేన కూడా తమకు బలం ఉందని అంటున్నారు. ఆ పార్టీకి పెరిగిన గ్రాఫ్ తో పొత్తులు ఉంటే కనుక టీడీపీకి ప్లస్ అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈసారికి రోజాకు టికెట్ ని పక్కన పెట్టి ఆమె భర్త సెల్వమణికి ఇచ్చేందుకు వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అలా చేయడం వల్ల రోజా ఫ్యామిలీకే టికెట్ ఇచ్చినట్లు అవుతుందని, ఆమె భర్త తమిళుడు, మొదలియార్ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నగరిలో టోటల్ గా సీన్ టర్న్ అవుతుందని ఆశిస్తున్నారు. అంతే కాదు ఇతర బీసీ వర్గాలు కూడా వైసీపీ వైపుగా మారుతారని అలా విజయం తధ్యమని వైసీపీ కొత్త ఆలోచన చేస్తోంది అని అంటున్నారు మరి అదే నిజమైతే రోజా కారణంగా ఆమె భర్త తమిళ సినీ దర్శకుడు అయిన సెల్వమణి రాజకీయాల్లోకి వస్తారా అన్న టాపికే ఆసక్తిగా ఉంది.