సత్య కుమార్ వెనుకబడ్డారే.. ఏం జరిగింది ..!
కేంద్రంలోని పెద్దలతో అత్యంత చనువు ఉన్న నాయకుడిగా.. పార్టీ సీనియర్ నాయకుడిగా కూడా.. మంచి పేరున్న సత్య కుమార్.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వెనుకబడడమే దీనికి కారణమని తెలుస్తోంది.
By: Tupaki Desk | 26 Dec 2024 12:30 PM GMTబీజేపీ నాయకుడు... కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిని సంపాయించుకున్న ఏకైక ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్. మంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మొన్నటి దాకా దూకుడుగానే ఉన్నారు. ఆసుపత్రుల తనిఖీలు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు.. ఇలా అనేక రూపాల్లో ఆయన దూకుడు ప్రదర్శించారు. దీంతో సత్యకుమార్ వస్తున్నారంటేనే అధికారుల గుండెలలోనూ గుబులు పుట్టింది. ఇక, మీడియా సమావేశాలు అంటే.. వైసీపీకి రేవు పెడుతున్నారన్న టాక్ కూడా వినిపించింది.
కానీ, ఎందుకో ఆయన వెనుక బడుతున్నారు. గత నెల రోజులుగా సత్యకుమార్ దూకుడు ఎక్కడా కనిపించడం లేదు. కేంద్రంలోని పెద్దలతో అత్యంత చనువు ఉన్న నాయకుడిగా.. పార్టీ సీనియర్ నాయకుడిగా కూడా.. మంచి పేరున్న సత్య కుమార్.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వెనుకబడడమే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీలను వద్దంటూ.. ఆయన లేఖ రాశారు. ఇది ప్రభుత్వ నిర్ణయమే. అయినా.. ఈ విషయంలో కేంద్ర ప్రశ్నలు సంధించింది.
దీనిపై వివరణ ప్రభుత్వ పరంగా కాకుండా.. తన పరంగా ఇచ్చుకోవడంతో బెడిసి కొట్టింది. అదేవిధంగా ప్రస్తుతం నిర్మాణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిధులను తెచ్చుకోవాల్సి ఉంటుం ది. కానీ, ఈ విషయంలోనూ కేంద్రం నుంచి రూపాయి రాలేదు. మరోవైపు.. తను ఎంతగా దూకుడు చూపిస్తున్నా అధికార యంత్రాంగంలో పెద్దగా చలనం లేకపోవడం.. కూడా సత్యకుమార్ యాదవ్‌కు మైనస్‌గా మారిపోయింది.
దీంతో తను ఎంతదూకుడుగా ఉన్నా యంత్రంగంలో చలనం లేదని రెండు మాసాల కిందట ఆయన ఆక్షేపించారు. పైగా తను తనిఖీలకు వెళ్తే.. కొన్ని ప్రాంతాలనే చూపిస్తున్నారని.. మిగిలిన వాటి జోలికి పోతే ఇబ్బందులని సెక్రటరీలే చెబుతుండడం కూడా.. ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో అటు నిధులు రాక, ఇటు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా సరిగాలేక.. సత్యకుమార్ దూకుడు తగ్గించారనే టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆయన మౌనంగా ఉన్నారు. కేంద్రం కరుణిస్తే.. నిధులు తెచ్చుకుని పనులు చేయాలని చూస్తున్నారట.