వారి నుంచి చంద్రబాబుకు కొత్త తలపోటు!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది.
By: Tupaki Desk | 17 Sep 2024 12:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. అంతా సవ్యంగానే సాగుతుందనుకున్న దశలో విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ఈ విపత్తును ఎదుర్కోవడంలో మొదట్లో ప్రభుత్వం ఇబ్బందిపడ్డా ఆ తర్వాత విజయవంతంగా సమస్యకు అడ్డుకట్ట వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ తదితరులు విజయవాడలోనే మకాం వేసి వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాగా వరద బాధితులకు భారీగా వివిధ పారిశ్రామిక సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, సినీ నటులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే సీనియర్ నేతలెవరూ ఆయన పిలుపునకు స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వరద బాధితులకు విరాళాలు ఇవ్వడంలో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల టీడీపీ సీనియర్ నేతలు మాత్రమే కాస్త స్పందించారని అంటున్నారు. మిగిలిన జిల్లాల్లో టీడీపీ సీనియర్ నేతలెవరూ ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించారని టాక్ నడుస్తోంది. ఈసారి మంత్రివర్గంలో చాలామంది సీనియర్ నేతలకు పదవులు దక్కలేదు. దీంతో సహజంగానే మంత్రి పదవులు దక్కనివారిలో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల్లో కొందరు వరద బాధితులకు విరాళాలు అందించడంలో ముఖం చాటేశారని చెబుతున్నారు.
మంత్రివర్గంలో ఈసారి చంద్రబాబు ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాకుండా పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో టీడీపీలో చాలామంది సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. ఇలాంటి వారంతా ఇప్పుడు వరద బాధితులకు విరాళాలు ఇవ్వడంతో సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వరద బాధితులకు విరాళాలపై సమీక్షించిన చంద్రబాబు సీనియర్ నేతలకు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. సీనియర్ నేతలు విరాళాలు ఇవ్వడంతోపాటు నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలవంతులైన ద్వితీయ శ్రేణి నేతలను సైతం విరాళాలు ఇచ్చేలా చూడాలని ఆదేశించినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఆశించినట్టు సీనియర్ నేతలు స్పందిస్తారా, లేదా అనేది వేచిచూడాల్సిందే.