రూ.50వేలకు కక్కుర్తి పడినోడికి రూ.100 కోట్ల ఆస్తులా?
విద్యుత్ శాఖలో హాట్ టాపిక్ గా మారిన సదరు అధికారి భాగోతం ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
By: Tupaki Desk | 16 Feb 2025 5:03 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు. ఇంత భారీగా సంపద ఉన్నోడు ఏం చేస్తాడు. భారీ ఆస్తితో పాటు.. మాంచి ఉద్యోగం ఉండటానికి మించిన లక్ ఇంకేం ఉంటుంది. కానీ.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.. వంద కోట్ల రూపాయిలకు ఆస్తి ఉన్నప్పటికీ.. కాసుల కక్కుర్తితో వ్యవహరించే ఒక అధికారి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. విద్యుత్ శాఖలో హాట్ టాపిక్ గా మారిన సదరు అధికారి భాగోతం ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈగా వ్యవహరిస్తున్న సతీశ్ రెడ్డి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి ఆస్తిపాస్తుల గురించి.. బ్యాంక్ అకౌంట్లు.. అందులో ఉన్న డబ్బుల గురించి ఏసీబీ అధికారులు విచారించటం మొదలు పెట్టారు. శుక్రవారం మొదలైన సోదాలు శనివారం వరకూ సాగాయి. ఈ సందర్భంగా కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు.
సదరు అధికారికి దగ్గర దగ్గర రూ.100 కోట్లకు పైనే ఆస్తులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఆ ఆస్తులు హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. రంగారెడ్డి.. కరీంనగర్ జిల్లాల్లోనూ ఉన్నట్లుగా గుర్తించారు. కరీంనగర్ జిల్లాలో 22 ఎకరాల వ్యవసాయ భూమి.. ఓపెన్ ప్లాట్లు.. విల్లా.. భవనాలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు.. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే అని తేల్చారు. ఏడీఈ ఇంట్లో ఈ భూముల పత్రాలు.. బంగారం.. నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయన్ను రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఏమైనా.. వంద కోట్ల రూపాయిలు ఆస్తులు ఉన్న తర్వాత కూడా డబ్బు కోసం కక్కుర్తి పడే ఇతడి వ్యవహారం ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. సంచలనంగా మారింది.