Begin typing your search above and press return to search.

రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ సీనియర్ నేత గుడ్ బై?

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసి.. శాసన సభా పర్వం కూడా మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతల్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 10:33 AM GMT
రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ సీనియర్ నేత గుడ్ బై?
X

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసి.. శాసన సభా పర్వం కూడా మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతల్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్ లో జారిపడి గాయపడ్డారు. కొత్త మంత్రులు బాధ్యతల్లోకి వచ్చారు.. ఇక మిగిలింది పార్టీల పరిస్థితి ఏమిటన్నదే. టీపీసీసీ చీఫ్ గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండు బాధ్యతలనూ మోస్తున్నారు. అటు కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఎంపీగా ఉన్నారు. సీపీఐ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లోనూ కొనసాగతున్నారు. ఎటొచ్చి బీజేపీ సంగతి ఏమిటనేదే.?


అధ్యక్షుడి మార్పు.. పార్టీకి చేటు

బీజేపీలో ప్రతి మూడేళ్లకు ఓసారి అధ్యక్షుడి నియామకం ఉంటుంది. 2000 మార్చిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారు. తన పదవీ కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాల ద్వారా సంజయ్ పార్టీని బలోపేతం చేశారు. మరోసారి ఆయనకే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని భావిస్తుండగా, అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పటికీ జి.కిషన్ రెడ్డిని తీసుకొచ్చి బాధ్యతలు అప్పగించింది కాషాయ పార్టీ అధిష్ఠానం. ఎన్నికలకు కేవలం కొద్ది నెలల ముందు జరిగిన ఈ పరిణామంతో తెలంగాణలో బీజేపీ వెనుకబడిందన్న వాదన ఉంది. కాగా, ఎన్నికల ఫలితాల్లో మాత్రం బీజేపీ మెరుగైన ప్రదర్శనే చేసిందని చెప్పాలి. 2018లో 7 శాతం ఓట్లు, ఒక్క స్థానంలోనే గెలిచిన ఆ పార్టీ.. తాజా ఎన్నికల్లో 14 శాతం ఓట్లు 8 సీట్లలో నెగ్గింది. మొత్తమ్మీద చూస్తే.. అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ఆ పార్టీ ప్రచారం మాత్రం నిజం కాలేదు.

పదవిలో ఉంటారా?

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నవారు.. సహజంగా ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తుంటారు. ప్రాంతీయ పార్టీల్లో అయితే సరే కానీ.. జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు మాత్రం బాధ్యతల నుంచి తప్పుకొంటారు. ఈ లెక్కన చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం రాజీనామా చేయాల్సి వస్తోంది. ఆయన కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఫలితాలు వెల్లడైన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ కిషన్ రెడ్డి నోటి నుంచి రాజీనామా మాట రాలేదు. తాజాగా వినవస్తున్నదేమంటే.. ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని కేంద్ర మంత్రిగా కొనసాగుతారని. దీనిలో వాస్తవమెంతో తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలం పెరిగినా.. అధికారానికి చాలా దూరంలో ఉండిపోయింది. మరోవైపు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అక్కడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అందులోనూ విఫలమైతే (ఆయనతో పాటు కనీసం ఇప్పుడున్న నాలుగు సీట్లు గెలవాలి) ఎలాగైనా తప్పుకోక తప్పదు. అందుకనే ముందే వైదొలగితే.. పార్టీ వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తుంది.