సీఎం జగన్ తో విభేదాలపై సీనియర్ మంత్రి హాట్ కామెంట్స్!
సీఎం జగన్ తో తనకు విభేదాలున్నాయనేది ఎల్లో మీడియా ప్రచారమేనని మండిపడ్డారు.
By: Tupaki Desk | 1 Jan 2024 8:06 AM GMTతనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో విభేదాలు ఉన్నాయనేది అంతా అబద్ధమని అటవీ, గనులు, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ తో తనకు విభేదాలున్నాయనేది ఎల్లో మీడియా ప్రచారమేనని మండిపడ్డారు. ఈ విషయంలో ఎల్లో మీడియా అభూత కల్పనలు చేస్తోందని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ తో తనకు విభేదాలుంటే ఇంకా తాను వైసీపీలో ఉంటానా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో చంద్రబాబు ఉనికి కోల్పోయేలా తాను చేస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ కు, తనకు మధ్య విభేదాలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియా తనపైన అసత్య కథనాలు రాస్తోందని నిప్పులు చెరిగారు.
నిత్యం ప్రజాసంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పరిపాలిస్తున్న సీఎం జగన్ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని పెద్దిరెడ్డి తేల్చిచెప్పారు. సీఎం జగన్‌తో తనకు విభేదాలున్నాయంటూ ఎల్లో మీడియా అభూతకల్పనలతో కథనాలు రాయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ తో తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. సీఎం జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. అంతేతప్ప ఆయనతో విభేదాలు పెట్టుకునే అవసరం, తత్వం తనది కాదని తేల్చిచెప్పారు.
కేవలం చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న దురాలోచనతోనే ఎల్లో మీడియా తనపై బురద జల్లుతోందని పెద్దిరెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ కు తనను దూరం చేస్తే చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో ఉనికి కోల్పోకుండా ఉండవచ్చన్న ఆలోచనతోనే ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ ఇప్పటికే పాడెపైకి చేరిందని ఎద్దేవా చేశారు. చివరి దశలో చంద్రబాబు దింపుడు కళ్లం ఆశతో ఉన్నారని విమర్శించారు.
జగన్ పై, తనపై, పార్టీ నేతలపై ఎలాంటి కట్టుకథలు రాసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించి 14 ఏళ్లపాటు అధికారంలో ఉండేలా చేసిన కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏ మేలూ చేయలేదని గుర్తు చేశారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరన్నారు.
దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకానన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు