Begin typing your search above and press return to search.

మీర్ పేట్ మాధవి మర్డర్ కేసు... పోలీసులకు బిగ్ సవాల్ ఎందుకంటే..?

ఈ ఘటనలో ఆనవాళ్లు దొరక్కుండా అతడు చేసిన పని ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:16 PM GMT
మీర్  పేట్  మాధవి మర్డర్  కేసు... పోలీసులకు బిగ్ సవాల్  ఎందుకంటే..?
X

మీర్ పేట్ లో గృహిణి మాధవి హత్య కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. యువతి మోజులో పడి భార్యను అడ్డు తొలగించుకునే క్రమమంలో నిందితుడు గురుమూర్తి అత్యంత కిరాతకంగా ఆమెను కడతేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆనవాళ్లు దొరక్కుండా అతడు చేసిన పని ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు.

అవును... మీర్ పేట్ మాధవి మర్డర్ కేసు ఇప్పుడు తెలంగాణ పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. దీని కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్ పర్ట్స్ సహాయం కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు కారణం.. మృతురాలి మాధవే అని చెప్పడానికి ఏ ఆచూకీ దొరకకుండా నిందితుడు జాగ్రత్తపడటమే అని చెబుతున్నారు.

దీంతో.. ఈ హత్య కేసులో ఆధారాల సేకరణలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. గురుమూర్తి చెప్పినట్లు ఆమె మృతదేహాన్ని బూడిదగా, మాంసపు ముద్దగా మార్చి చెరువులో పడేసినట్లయితే అది దొరికినా.. అది ఎవరిది అని నిరూపించడం అనేది ఇప్పుడు అతి పెద్ద సవాల్ అని చెబుతున్నారు.

ఈ సమయంలో గురుమూర్తి ఇంట్లో ఓ పొడవాటి వెంట్రుక దొరికిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ వెంట్రుకను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అది ఎవరి వెంట్రుకో తేల్చేందుకు ఆమె తల్లితండ్రులు, పిల్లల నుంచి డీ.ఎన్.ఏ. శాంపుల్స్ సేకరించి నిర్ధారించాల్సి ఉందని అంటున్నారు. రక్తపు మరకలను సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు.. ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారని అంటున్నారు. ఇదే సమయంలో.. ఈ తరహా హత్యలను ఛేధించిన దేశవ్యాప్త నిపుణులను రప్పించే పనిలో ఉన్నారని.. ఓ వ్యక్తి చెప్పిన విధంగా అది మాధవి మృతదేహమనే ఆనవాళ్లను నిర్ధరించలేదని చెబుతున్నారని తెలుస్తోంది.

ఇలా.. హత్య జరిగిందని తెలిసి, చేసిన వ్యక్తి ఫలానా అని తెలుస్తున్నా.. మృతురాలిని గుర్తించడానికి ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ సరికొత్త సవాల్ ను పోలీసులు ఎలా ఛేదిస్తారనేది వేచి చూడాలి!