జర్నలిస్ట్ హత్యకేసులో నిందితుడికి కూటమిలో ప్రమోషన్!?
అవును... సంచలనం సృష్టించిన గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ శివసేనలో చేరినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 Oct 2024 4:05 AM GMTజర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ మహారాష్ట్రలోని జల్నాలో శివసేనలో చేరాడు. ఇందులో భాగంగా... రాష్ట్ర మాజీ మంత్రి అర్జున్ ఖోట్కర్ సమక్షంలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు పీటీఐ నివేదించింది.
అవును... సంచలనం సృష్టించిన గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ శివసేనలో చేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన ఖోట్కర్... పంగార్కర్ మాజీ శివసైనికుడని, నేడు పార్టీలోకి తిరిగి వచ్చాడని.. జల్నా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయన చీఫ్ గా నామినేట్ అయ్యారని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక, తాను జల్నా నుంచి పోటీ చేయనున్నట్లు ఖోట్కర్ తెలిపారు. మహాయుతిలో (శివసేన, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడిన కూటమి) సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కాగా... 2017 సెప్టెంబర్ 5న జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను బెంగళూరులోని ఆమె ఇంటి బయట కాల్చి చంపిన సంగతి తెలిసిందే! జాతీయ మీడియా నివేదికల ప్రకారం... జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. ప్రధాన నిందితుడు అమోల్ కాలె సీనియర్ సహచరుడిగా పంగాకర్ ను సూచించింది.
గౌరీ లంకేష్ ను హత్య చేయాలని మహారాష్ట్రకు చెందిన వ్యక్తులే ఆదేశాలు జారీ చేశారని అమోల్ కాలే వెల్లడించినట్లు సిట్ పేర్కొంది. ఇదే సమయంలో... గౌరీ లంకేష్ హత్యకు ముందు, తర్వాత పంగార్కర్.. కాలేతో టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని చెబుతారు. ఇతడు 2018 ఆగస్టులో అరెస్టయ్యాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ 4న బెయిల్ పై విడుదలయ్యాడు. అంతక ముందు 2011లో శివసేన అతడికి టిక్కెట్ నిరాకరించడంతో.. మితవాద హిందూ జనజతృతి సమితిలో చేరాడు. ఇక ఈ ఏడాది ఆగస్టులో.. 2018 ఆయుధ రవాణా కేసుకు సంబంధించి ఆరోపణలు ఉన్నా.. తగిన సాక్ష్యాధారాలు లేవని బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది!