Begin typing your search above and press return to search.

15 మందికి మరణశిక్ష... బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు!

ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో దోషులుగా తేలిన 15మందికి శిక్ష విధిస్తూ కేరళ కోర్టు తీర్పు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 7:36 AM GMT
15 మందికి మరణశిక్ష... బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు!
X

కేరళలోని బీజేపీ నేత, న్యాయవాది రంజీత్ శ్రీనివాసన్ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నేరుగా ఈ బీజేపీ ఓబీసీ మోర్చా నేత ఇంటికి వెళ్లి మరీ కుటుంబ సభ్యుల మధ్యే నరికి చంపిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో దోషులుగా తేలిన 15మందికి శిక్ష విధిస్తూ కేరళ కోర్టు తీర్పు వెల్లడించింది.

అవును... 2021 డిసెంబర్ లో బీజేపీ నేత, న్యాయవాది రంజీత్ శ్రీనివాసన్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి తాజాగా కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ.ఎఫ్.ఐ), ఎస్డీపీఐతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ కోర్టు జనవరి 20న తీర్పు వెలువరించింది.

ఈ క్రమంలో రంజిత్ శ్రీనివాసన్ హత్యలో ప్రధానంగా ఎనిమిది మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని.. మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించిందని తెలుస్తుంది! దీంతో... నిజాం, అనూప్, అజ్మల్, సలాం, మహ్మద్ అస్లాం, సఫరుద్దీన్, మున్షాద్, అబ్దుల్ కలాం, షెమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, జజీబ్, నవాజ్, షాజీ, షమ్నాజ్ లను దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం.

కాగా... 2021 డిసెంబరు 18న ఎస్‌డీపీఐ నాయకుడు కేఎస్‌ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్‌ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఇందులో భాగంగా... డిసెంబర్ 19న ఉదయం రంజిత్ శ్రీనివాసన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు... ఆయనను కుటుంబ సభ్యుల ఎదుటే దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.

ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ మావెలికర అదనపు సెషన్స్ జడ్జి వీజీ శ్రీదేవి తీర్పు చెప్పారు. వాస్తవానికి ఈనెల 20న నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించింది.. డిఫెన్స్, నిందితుల వాదనలు విన్న అనంతరం శిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

ఈ సందర్భంగా ఈ కేసులో విచారణకు వచ్చిన పదిహేను మంది నిందితుల్లో ఒకరి నుంచి ఎనిమిది మంది నిందితులు నేరుగా హత్యకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించగా... రంజిత్‌ శ్రీనివాసన్ పారిపోకుండా ఉండేందుకు, అరుపులు విని ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే ఆపేందుకు మారణాయుధాలతో కాపలాగా ఉన్న తొమ్మిది నుంచి 12 మంది నిందితులు 149 సెక్షన్‌ కింద హత్యా నేరానికి పాల్పడ్డారనే ప్రాసిక్యూషన్‌ వాదనను కోర్టు అంగీకరించింది.

ఇదే సమయంలో... ఈ నేరానికి సంబంధించిన కుట్రలకు నాయకత్వం వహించిన 13 నుండి 15 మంది నిందితులూ హత్యకు పాల్పడినట్లేనని కోర్టు నిర్ధారించింది. ఈ నేపథయంలో... అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసుగా పేర్కొంటూ గరిష్టంగా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. అనంతరం... న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ సంచలన తీర్పు వెల్లడించారు!