ఆ మాజీ ఎమ్మెల్యేకు జైలులో స్పెషల్ బ్యారక్
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తరువాత హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బారక్ కేటాయించాలని కోరారు.
By: Tupaki Desk | 19 Nov 2024 9:37 AM GMTవికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయన అభ్యర్థనను మన్నించి జైలు అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసింది.
లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాకింగ్‌కు వెళ్లిన ఆయనను ఫిల్మ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు.
అక్కడ హైదరాబాద్ మల్టీజోన్ -2 ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి తదితరులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. ఆ తరువాత నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కొడంగల్ ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి.. రిమాండ్ రిపోర్టులో నరేందర్ రెడ్డిని ఏ1గా చేర్చారు. ఏ2గా సురేశ్ పేరును చేర్చారు.
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తరువాత హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బారక్ కేటాయించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కావడం వల్ల స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని న్యాయవాది కోరారు. ఆ సమయంలో హైకోర్టుకు సెలవు ఉండడంతో ఈ అభ్యర్థనను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.
తాజాగా.. పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తోటి ఖైదీలతో కాకుండా నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు ఇంటి భోజనం కూడా అనుమతించాలని తెలిపింది.