Begin typing your search above and press return to search.

వీడెంత ముదురంటే.. 4 రాష్ట్రాల అమ్మాయిలకు మస్కా

చూసినంతనే చదువుకున్నోడిలా బిల్డప్ఇస్తూ.. మాటలతో బురుడీ కొట్టించేవీడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రాష్ట్రాల మహిళల్నిపెళ్లి పేరుతో మస్కాకొట్టేశాడు.

By:  Tupaki Desk   |   16 March 2025 10:01 AM IST
వీడెంత ముదురంటే.. 4 రాష్ట్రాల అమ్మాయిలకు మస్కా
X

చూసినంతనే చదువుకున్నోడిలా బిల్డప్ఇస్తూ.. మాటలతో బురుడీ కొట్టించే వీడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రాష్ట్రాల మహిళల్ని పెళ్లిపేరుతో మస్కాకొట్టేశాడు. తప్పుడు సమాచారంతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల వేదికగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటకల్లో పలువురు యువతుల నుంచి పెద్ద ఎత్తున నగదు కాజేసిన ఈ ముదురు టెంక వ్యవహారం చూస్తే షాక్ తినాల్సిందే.

మొత్తంగా వీడి పాపం పండింది. తాజాగా ఇతడ్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి యవ్వరాల చిట్టా తీస్తే.. ఇతగాడి మీద 24 కేసులు ఉన్న విషయం వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన 33 ఏళ్ల జోగాడ వంశీ క్రిష్ణ అలియాస్ హర్ష చెరుకూరి పలు మ్యాట్రిమోని వెబ్ సైట్లలో తానో ఎన్నారై వ్యాపారినని.. ఐటీ ఉద్యోగినంటూ ప్రొఫైల్స్ పెట్టాడు. సెకండ్ మ్యారేజ్ కోసం చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

ముప్ఫై ఏళ్ల వయసున్న వారిని టార్గెట్ చేసుకున్న ఇతడు.. యానం ఎమ్మెల్యేతో ఉన్న ఫోటోను డీపీగా పెట్టుకొనేవాడు. ఇతడి ప్రొఫైల్ చూసిన పలువురు యువతులు ఇతన్ని కాంటాక్టు చేస్తే. వాట్సప్ కాల్ తో మాట్లాడేవాడు. తన తల్లి అమెరికాలో డాక్టర్ అని.. తాను లోకల్ గా ఉంటూ బిజినెస్ చేస్తుంటానని.. అమెరికా నుంచి అమ్మ వచ్చినంతనే పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు.

వారు తన మాటల్ని నమ్మే వరకు తీసుకొచ్చి.. తన బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారని.. ఐటీ అధికారులు వచ్చి డబ్బులు జప్తు చేశారని..ఇంట్లో వాళ్లు ఆసుపత్రుల్లో ఉన్నట్లు.. వ్యాపారంలో నష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.5 నుంచి రూ.25 లక్షల వరకు కాజేసేవాడు. బాధితులు డబ్బుల గురించి డిమాండ్ చేస్తే.. వారి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించేవాడు.

ఇతగాడి పాపం తాజాగా పండింది. జూబ్లీహిల్స్ కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఇతడు రూ.10.94 లక్షలు కాజేశాడు. ఆమె కంప్లైంట్ తో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ నెల పదమూడున అతడ్ని బెంగళూరులో అరెస్టు చేశారు. బీటెక్ మధ్యలో ఆపేసి 2014లో హైదరాబాద్ కు వచ్చిన ఇతడు.. ఆన్ లైన్ గేమింగ్.. బెట్టింగులకు అలవాటు పడ్డాడు. 2016లో జాబ్ కన్సల్టెన్సీలో చేరి యువకుల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేసి అరెస్టు అయ్యాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళల పేర్లతో తప్పుడు ఖాతాల్ని క్రియేట్ చేసి తన ఆదాయంలో అత్యధిక భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లుగా నమ్మిస్తూ దాదాపు వెయ్యి మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘన చరిత్ర ఇతగాడిది. జాబ్స్ ఇప్పిస్తానంటూ 50 మంది నుంచి రూ.2.5 కోట్లు కాజేశాడు. రెండేళ్ల క్రితం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇతడ్ని అరెస్టు చేశారు. మళ్లీ.. ఇప్పుడు అరెస్టు అయ్యాడు. ఇలాంటి వారి మీద పీడీ యాక్టు పెట్టాలన్న మాట బలంగా వినిపిస్తోంది.