బీడీ తాగొద్దంటే చంపేస్తాడు.. వీడి గురించి చదవితే వణుకే!
అంతర్రాష్ట్ర నిందితుడైన 29 ఏళ్ల రాహుల్ అలియాస్ బోలును అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు.. అతడ్ని విచారించే వేళలో అతను చెప్పిన హత్యల పరంపరకు విస్మయానికి గురైన పరిస్థితి.
By: Tupaki Desk | 5 Feb 2025 8:30 AM GMTట్రైన్ లో జర్నీ చేసే టైంలో ఎవరైనా సిగిరెట్ కానీ బీడీ కానీ తాగుతుంటే వద్దని వారిస్తాం. అలాంటి పని చేసిన వారందరికి చంపేసే దుర్మార్గం ఇతడు చేస్తుంటాడు. తాజాగా అతన్ని సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. విచారణలో భాగంగా అతడి నేరచరిత్ర చిట్టా విప్పిన వైనం తెలిస్తే షాక్ కు గురి కావాల్సిందే. అంతర్రాష్ట్ర నిందితుడైన 29 ఏళ్ల రాహుల్ అలియాస్ బోలును అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు.. అతడ్ని విచారించే వేళలో అతను చెప్పిన హత్యల పరంపరకు విస్మయానికి గురైన పరిస్థితి.
హర్యానాలోని రోహతక్ జిల్లా మోఖ్రా గ్రామానికి చెందిన రాహుల్.. చిన్న వయసులోనే దొంగతనాలకు పాల్పడటంతో అతడ్ని ఇంటి నుంచి పంపేశారు. దీంతో ట్రక్కు డ్రైవర్ గా కొంతకాలం పని చేశాడు. చెడు అలవాట్లకు బానిసైన ఇతను.. వస్తున్న డబ్బులు సరిపోకపోవటంతో లారీలను దొంగలించి..వాటిని తుక్కుగా మార్చి వాటిని అమ్మేసి డబ్బులు సంపాదించటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. గత అక్టోబరు 20న పుణె - కన్యాకుమారి ఎక్స ప్రెస్ లో వికలాంగుల కోచ్ లో కూర్చొని బీడీ వెలిగించాడు. అతడికి దగ్గర్లో ఉన్న మహిళ బీడీ పొగ మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో అతడి నోట్లో నుంచి బీడీ తీసి బయటకు విసిరేసింది. దీంతో.. ఆమె గొంతు నులిమి చంపేయటంతో పాటు.. డెడ్ బాడీ మీద అత్యాచారం చేసి పారిపోయాడు.
ఈ హత్య చేసిన ఐదు రోజుల వ్యవధిలోనే హుమనూర్ నుంచి మంగళూరు రైల్లో బయలుదేరాడు. సెల్ ఫోన్ లో పాటలు వింటూ.. బీడీ తాగుతున్న వేళలో ఒకరు బీడీ కాల్చొద్దంటూ చెప్పటంతో అతడితో గొడవ పడ్డాడు. తన చేతి సంచిలో ఉన్న తీగతో అతడి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత బాంద్రా స్టేషన్ పట్టాల మీద నడుచుకుంటూ వెళుతున్న వేళ.. ఒక యువతిని ఫాలో అయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె సెల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఆ సందర్భంగా తన చేతి సంచిని మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ సందర్భంలో డెడ్ బాడీ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.
నవంబరు 18న కతిహార్ - హౌరా ట్రైన్ లో బీడీ తాగుతుంటే.. ఒక పెద్ద వయస్కుడు అభ్యంతరం చెప్పటంతో అతడ్ని కూడా కొట్టి చంపేశాడు. నవంబరు 23న బళ్లారి రైల్వే స్టేషన్ లో బద్రాచలం వెళ్లే రైలు ఎక్కిన అతను.. లేడీస్ కోచ్ లో ఎక్కాడు. ఒక మహిళ అది లేడీస్ కోచ్ అని అభ్యంతరం చెప్పింది. తర్వాతి స్టేషన్ లో దిగిపోతానని చెప్పి.. బీడీ వెలిగించాడు. ఆమె అభ్యంతరం చెబుతూ పోలీసులకు ఫోన్ చేయబోగా.. టవల్ తో గొంతుకు బిగించి చంపేశాడు. ఆమె ఫోన్ తీసుకొని ట్రైన్ దిగేశాడు.
ఇలా ఒకటి తర్వాత ఒకటిగా చొప్పున హత్యలు చేసుకుంటూ పోయాడు. నవంబరు 23న ట్రైన్ లో హత్య తర్వాత. మరో ట్రైన్ లో ముంబయికి వచ్చి కచ్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఆ రోజు రాత్రి వాపి స్టేషన్ లో వెళుతుండగా.. పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడు. అతడి సంచిలో బాంద్రా వద్ద చంపేసి అత్యాచారం చేసిన యువతి సెల్ ఫోన్.. ఫోటోలు ఉండటంతో అనుమానం వచ్చి.. ప్రశ్నించటంతో విస్తుపోయే నేరాల చిట్టా బయటకు వచ్చింది. ఈ కేసులో అతడ్ని రిమాండ్ కు తరలించారు. ఇతడి దారుణ నేరాల నేపథ్యంలో ఆయా స్టేషన్ల పరిధిలోని వారు ట్రాన్సిట్ వారెంట్లపై తీసుకొచ్చి విచారిస్తున్నారు. తాజాగా.. సికింద్రాబాద్ పోలీసులు అతడ్ని తీసుకొచ్చారు.