Begin typing your search above and press return to search.

రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిందేనా ?

దేశంలో దిగ్భ్రాంతి కలిగించే విధంగా రైల్వే వ్యవస్థ వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Feb 2025 8:20 AM GMT
రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిందేనా ?
X

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వరస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశంలో దిగ్భ్రాంతి కలిగించే విధంగా రైల్వే వ్యవస్థ వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు

భారతీయ రైల్వే వ్యవస్థకు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థగా ఉంది. అతి తక్కువ ధరకు సదూర ప్రాంతాలకు వేగంగా చేర్చడంలో రైల్వే వ్యవస్థను మించినది వేరేది లేదు. ఇదిలా ఉంటే భారతీయ రైల్వేలో నిర్లక్ష్యం ఉదాశీనత కొంత మేర ఉందని విమర్శలు ఉన్నాయి.

వాటి ఫలితంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా చూస్తే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాతి జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఉండటంతో కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే, కుంభమేళాకే వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్‌ఫ్లాంపై ఉండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి తొక్కిసలాట చోటుచేసుకుందని చెబుతున్నారు.

మహా కుంభమేళ ఆఖరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ళు వేసినా చాలడం లేదు. మరో వైపు సమాచార లోపం కూడా వ్యవస్థలో నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విపక్షాలు అంటున్నాయి. ఇక చూస్తే కనుక రద్దీని అంచనా వేశామని అయితే అంతా క్షణాల్లో జరిగిపోయింది రైల్వే పేర్కొంది. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు రైల్వే శాఖ తెలిపింది.

వీటిని పక్కన పెడితే రైల్వే శాఖ నిర్వహణ తీరు గడచిన పదేళ్ల కాలంలో ఎలా ఉందో చెప్పడానికి అన్నట్లుగా దేశంలో అనేక ప్రమాదాలు జరిగాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో ఈ ప్రమాదాల సంఖ్య 638 నమోదైంది.

రైల్వే ప్రమాదాలు అంతకు ముందుతో పోలిస్తే ఇవే తక్కువగా ఉన్నాయని అంటున్నా ఈ ప్రమాదాలు కూడా ఇంకా తగ్గించి ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అందించలేరా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో రైల్వే వ్యవస్థలో పేరుకుపోయిన ఉదాశీనతకు కూడా తగిన పరిష్కారం చూపాల్సి ఉందని అంటున్నారు.

ఇక చూస్తే ఢిల్లీలో జరిగినది తొక్కిసలాట. దాని వెనక రైల్వే శాఖ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సరైన సమాచారం అందించలేకపోవడం తో పాటు రద్దీని సైతం అంచనా వేయలేకపోవడం ప్రయాణీకులకు అవసరమైన రైళ్ళను అందుబాటులోకి తీసుకుని రాలేకపోవడం వంటివి ఉన్నాయి.

వీటి మీద విపక్షాలు అయితే గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి. రైల్వే మంత్రి రాజీనామా అని కూడా డిమాండ్ వస్తోంది. అయితే రైల్వే మంత్రి రాజీనామా అన్నది రాజీకీయ పరమైన డిమాండ్. దాని కంటే ముందు రైల్వే వ్యవస్థలోని లోపాలను సక్రమంగా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేల కోసం రైలు భద్రత కోసం రూ.1,78,012 కోట్ల దాకా గడచిన ఆర్ధిక సంవత్సరంలో కేటాయించింది. అలాగే సగటు వార్షిక వ్యయం రూ. 17,801 కోట్లగా ఖర్చు చేస్తోంది.

వీటితో పాటు రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం అయితే ఉందని తాజా ఉదంతం తెలియచేస్తోంది. ఏది ఏమైనా అమాయక ప్రజలు తొక్కిసలాటలో ప్రాణాలను కోల్పోవడం మాత్రం అత్యంత బాధాకరం. ఇది రైల్వే వ్యవస్థకు కూడా అవమానకరమే అని అంటున్నారు.