బంగ్లాదేశ్‌లో ఖైదీల పరార్.. పెరుగుతున్న ఉత్కంఠ
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 5 Dec 2024 3:30 PM GMTబంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. చివరకు ప్రధాని షేక్ హసీనా సైతం తన పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోవాల్సి వచ్చింది. దాంతో ఆమె పొరుగు దేశంలో తలదాచుకుంటున్నారు.
ఈ ఘటన జరిగి నెలలు జరుగుతున్నప్పటికీ ఇంకా అల్లర్లు చల్లారలేదు. తాజాగా.. ఆ దేశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడ అల్లర్లు, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. గతంలో షేక్ హసీనా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమ సమయంలో జైళ్లను బద్దలుకొట్టారు. దాంతో దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పారిపోయారు.
అప్పటి నుంచి వారి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. 2,200 మందిలో 1,500 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 700 మంది ఆచూకీ లేదని జైళ్ల శాఖ చీఫ్ సయిద్ మహ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు. ఈ ఏడాది జూలై 19న జరిగిన అల్లర్లు సంద్భంగా ఢాకాలోని నార్సింగి జైలుపై వందలాది మంది దాడిచేసి నిప్పు పెట్టారు. అందులోని ఖైదీలను విడిపించారు. వీరిలో 70 మంది ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలే ఉన్నట్లు వివరించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లిన తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఉగ్రవాదులపై నిఘా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారాల్లో మరో నాలుగు జైళ్లపై కూడా దాడులు జరిగాయి. వీటిల్లో సైతం కరుడుగట్టిన నేరస్తులను పెట్టే కషిమ్‌పూర్ జైలు కూడా ఉంది.
మరోవైపు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. సుమన్‌గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడిచేసింది. ఫేస్‌బుక్ పోస్టులో హిందూ యువకుడిపై దైవదూషణ ఆరోపణలు వచ్చాయి. దాంతో హింస పెరిగిపోయింది. ఛాందసవాద మూక వంద మందికి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు. ఇళ్లలోని ప్రార్థనా స్థలాలను కూడా వదిలిపెట్టలేదు. దీంతో ఇటీవల 200కు పైగా హిందూ కుటుంబాలు వలస వెళ్లాయి.