Begin typing your search above and press return to search.

రేవంత్‌ను చంపేందుకు కుట్ర.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు!

జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై ప్రకంపనలు చల్లారడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   29 Oct 2024 7:14 AM GMT
రేవంత్‌ను చంపేందుకు కుట్ర.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు!
X

జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై ప్రకంపనలు చల్లారడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ అని మాజీమంత్రి కేటీఆర్ అంటుంటే.. ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్, ఫారిన్ మందు ఎందుకు వాడాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. కేటీఆర్‌ను నార్కోటిక్ పరీక్షలకు సిద్ధం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ.. గతంలో రేవంత్ రెడ్డి అరెస్టు విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. కేటీఆర్‌ను ప్రశ్నలతో ముంచెత్తారు. మీ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో దొరికిన డ్రగ్స్, లిక్కర్, అమ్మాయిలు, అబ్బాయిల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అడ్డంగా దొరికి కూడా బుకాయించడానికి సిగ్గు, శరం ఉండాలని విమర్శలు చేశారు. ముందుగా కేటీఆర్ నార్కోటిక్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీవారం కేటీఆర్ బామ్మర్ది పార్టీ పెడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం ఉందని, ఆ ఇన్ఫర్మేషన్‌తోనే వారు దాడి చేశారని తెలిపారు. గతంలో జన్వాడ ఫామ్‌హౌస్‌తో తనకు సంబంధం లేదని చెప్పిన కేటీఆర్.. హైడ్రా వచ్చినప్పుడు తన ఫ్రెండ్‌ది అని చెప్పావు.. ఇప్పుడేమో తన బామ్మర్దిది అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఫ్యామిలీ పార్టీ అంటే లీటర్ లిక్కర్, ఆరు బీర్ బాటిల్స్ మాత్రమే ఉండాలని ఎక్సైజ్ నిబంధనల గురించి తెలియదా అని షబ్బీర్ నిలదీశారు. చట్టం తెలిసిన వ్యక్తులే తప్పులు చేస్తే కేసులు పెట్టకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే షబ్బీర్ అలీ గతంలో రేవంత్ రెడ్డి అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘గతంలో జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగరేసి వాస్తవాలు బయటపెట్టినందుకు చిన్న పిటి కేసులో ఆ రోజు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 14 రోజులు జైలులో పెట్టింది.ఆ జైలులో కూడా రాజకీయ ఖైదీగా పెట్టలేదు. రేవంత్‌కు అప్పటికి ఎలాంటి శిక్షపడలేదు. ఆయన మీద నేరం రుజువు కాలేదు. అండర్ ట్రయల్ అంటే అండర్ కోర్టులో కేసు నడుస్తున్నది. అలాంటప్పుడు ఆయనను జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల మధ్యల పెట్టారు. రేవంత్‌ను ఆ సమయంలో హత్య చేయాలని అనుకున్నారు. అదే వ్యక్తి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ హవాయి చెప్పల్ నుంచి హవాయి జహజ్ వరకు ఎదిగారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి’ అని విజ్ఞప్తి చేశారు.