భారతీయులకు సంకెళ్లు... జై శంకర్ ఇలా - అక్రమ వలసదారులు అలా!
ఈ నేపథ్యంలో రాజ్యసభలో స్పందించిన జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 6 Feb 2025 11:37 AM GMTఅమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ తీవ్ర చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం సంగతి అలా ఉంచితే.. వారిని కాళ్లు, చేతులూ బంధించి భారత్ కు తిరిగి పంపడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ట్రంప్ సర్కార్ మిలటరీ విమానంలో బుధవారం వెనక్కి పంపిన సమయంలో.. అక్కడ ఉన్న అక్రమ వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతికి సంకెళ్లు ఉన్న ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోలపై ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్ మెంట్ నిజ నిర్ధారణ ప్రక్రియ చేపట్టింది.
ఈ సందర్భంగా... అవి భారతీయుల ఫోటోలు అనే ప్రచారం ఫేక్ అని తేలినట్లు వెల్లడించింది. ఆ ఫోటోల్లో ఉన్నది భారతీయులు కాదని.. వాస్తవానికి అవి అమెరికాలో ఉన్న కొంతమంది అక్రమ వలసదారులను గ్వాటెమాలాకు పంపిస్తున్నప్పటి ఫోటోలని రాసుకొచ్చింది. దీంతో... మిగిలిన వాళ్లతో పోలిస్తే భారతీయుల విషయంలో ట్రంప్ కాస్త గౌరవ భావంతోనే ఆలోచించినట్లున్నారనే చర్చ జరిగింది.
ఈ లోపు తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులైన భారతీయులను తిరిగి స్వదేశానికి పంపుతున్న వ్యవహారానికి సంబంధించిన వీడియోను యూఎస్ బోర్డర్ పెట్రోల్ చీఫ్ మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్స్ పంచుకున్నారు. ఆ వీడియోలో.. బహిష్కరించబడిన భారతీయులు విమానంలో ప్రవేశిస్తున్నప్పుడు వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి ఉండటం స్పష్టంగా కనిపించింది.
ఈ క్రమంలో.. అమెరికా నుంచి భారత్ కు పంపబడిన పలువురు వ్యక్తులు స్పందించారు. ఈ సందర్భంగా... తమను విమానంలో బంధించి ఉంచారని.. తిరిగి భారత్ లో ల్యాండ్ అయిన తర్వాతే సంకెళ్ల నుంచి విముక్తి లభించిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో స్పందించిన జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్న వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ... అమెరికాలో ఏళ్ల నుంచి ఈ అక్రమవలసదారుల ప్రక్రియ జరుగుతూనే ఉందని.. అన్నిదేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని.. వీరి సంఖ్య 2012లో 530 ఉంటే.. 2019లో 2 వేలకు పెరిగిందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే ప్రక్రియను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ చూసుకుంటుందని.. వలసదారులను తరలించే విషయంలో నిబంధనల ప్రకారం వారిని నిర్భందిస్తారని తెలిపారు. ఇందులో ఎటువంటి మార్పూ లేదని.. కాకపోతే మహిళలు, చిన్నారులను నిర్భందించలేదని తమకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.
ప్రయాణికులందరికీ సంకెళ్లు వేశారు!:
ఇలా అమెరికా నుంచి అక్రమ వలసదారులను భారత్ కు తరలించే విషయంలో రాజ్యసభలో జైశంకర్ చెప్పినట్లుగా పరిస్థితి లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా.. జస్పాల్ సింగ్ (36) అనే వ్యక్తి ఈ బహిష్కరణ సమయంలో అమెరికా అధికారులు ఎలా ట్రీట్ చేశారనే విషయాన్ని వెల్లడించారు. ఈ సమయంలో... తనతో పాటు ప్రయాణికులందరికీ కూడా సంకెళ్లు వేసినట్లు వెల్లడించారు.
ఆ మిలటరీ విమానంలో ప్రయాణించిన భారతీయులందరీ చేతులు, కాళ్లను అమెరికా సైనికులు కట్టివేశారని.. ప్రయాణ సమయం అంత అలానే ఉంచారని.. భారత్ లో ల్యాండింగ్ తర్వాత మాత్రమే ఈ సంకెళ్లు తొలగించబడ్డాయని స్పష్టం చేశారు. దీంతో... ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.