Begin typing your search above and press return to search.

ఎవరీ షగున్ పరిహర్? కశ్మీర్ లో ఆమె గెలుపు ఎందుకంత స్పెషల్?

ఈ ఎన్నికల్లో ఆశించినంతగా కమలనాథులు ఫలితాల్ని సొంతం చేసుకోకపోవచ్చు కానీ.. షగున్ గెలుపు వారిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని మాత్రం చెప్పకతప్పదు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 6:02 AM GMT
ఎవరీ షగున్ పరిహర్? కశ్మీర్ లో ఆమె గెలుపు ఎందుకంత స్పెషల్?
X

జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ అభ్యర్థి షగున్ పరిహర్ గెలుపు మాత్రం సో స్పెషల్. ఈ ఎన్నికల్లో ఆశించినంతగా కమలనాథులు ఫలితాల్ని సొంతం చేసుకోకపోవచ్చు కానీ.. షగున్ గెలుపు వారిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని మాత్రం చెప్పకతప్పదు. అంతేకాదు.. ఆమె ప్రత్యేకత ఏమంటే.. జమ్ముకశ్మీర్ లో బీజేపీ అభ్యర్థుల్లో ఏకైక మహిళా అభ్యర్థి ఆమెనే.

కిష్ట‌వార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడి నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సజాద్‌ అహ్మద్‌ కిచ్లూ బరిలో నిలిచారు. అలాంటిది ఆయన్ను ఓడించి మరీ జెయింట్ కిల్లర్ గా మారారు. అదెలా సాధ్యమైంది? అంటే.. ఆమె బ్యాక్ గ్రౌండే ఆమె విజయానికి కారణంగా చెప్పాలి.

మాజీ మంత్రి కిచ్లూ ఫ్యామిలీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గం కంచుకోట లాంటిది. ఆ స్థానంలో ఆయన రెండుసార్లు.. ఆయన తండ్రి మూడుసార్లు విజయం సాధించారు. అలాంటి ఆయన్ను ఎన్నికల్లో ఓడించిన ఈ 29 ఏళ్ల యువతి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో కొత్త సంచలనంగా మారారు. ఆమె గెలుపు ఎలా సాధ్యమైందన్న విషయంలోకి వెళితే.. ఉన్నత విద్యావంతురాలైన షగున్ పరిహర్ ఉగ్రవాద బాధితురాలు.

2018 నవంబరులో జరిగిన ఉగ్రదాడిలో ఆమె తండ్రి అజిత్ పరిహార్.. చిన్నాన్న అనిల్ పరిహర్ ప్రాణాలు కోల్పోయారు. జిల్లా నేతగా పేరున్న అజిత్ పరిహార్ బీజేపీ తరఫున కార్యక్రమాల్ని నిర్వహించేవారు. ఉగ్రదాడిలో ఆయన మరణించటంతో స్థానికంగా ఆమె మీద సానుభూతి నెలకొంది. ఈ కారణంతోనే ఆమె విజయం సులువైంది. కాకుంటే.. పోటాపోటీగా సాగిన ఎన్నికల ఫైట్ లో ఆమె కేవలం 521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె విజయం కశ్మీర్ బీజేపీకి కొత్త ఉత్సాహంతో పాటు.. కొత్త తరానికి కశ్మీరీ ఓటర్లు ఓట్లు వేశారని చెప్పక తప్పదు.