Begin typing your search above and press return to search.

బన్నీ పిటిషన్ లో కీలకంగా "షారుఖ్ వర్సెస్ వడోదర" రిఫరెన్స్ ఏమిటి?

2017 జనవరి 23న షారుఖ్ ఖాన్ తన సినిమా "రయీస్" ప్రమోషన్ కోసం వడోదర వచ్చారు. అక్కడ ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 6:41 PM GMT
బన్నీ పిటిషన్  లో కీలకంగా షారుఖ్  వర్సెస్  వడోదర రిఫరెన్స్  ఏమిటి?
X

అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో భాగంగా వాదనలు వినిపించిన ఆయన తరుపు న్యాయవాది.. ‘షారుఖ్ – వడోదర’ తొక్కిసలాట కేసును నివేదించారు! దీంతో... 2017లో జరిగిన ఈ కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా... అసలు ఏమిటా కేసు, అందులో షారుఖ్ ఏ పాయింట్ పై బయట పడ్డారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... అల్లు అర్జున్ కేసులో వాదనల సందర్భంగా షారుఖ్ ఖాన్ - వడోదర కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 2017లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన తుది తీర్పు ఏప్రిల్ 27 - 2022లో గుజరాత్ హైకోర్టు వెలువరిస్తూ.. ఈ కేసును రద్దు చేసింది! అసలు కేసు ఏమిటి.. ఏమి జరిగింది.. హైకోర్టు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం వల్ల షారుఖ్ కి రిలీఫ్ దక్కింది అనేది ఇప్పు చూద్దాం...!

2017 జనవరి 23న షారుఖ్ ఖాన్ తన సినిమా "రయీస్" ప్రమోషన్ కోసం వడోదర వచ్చారు. అక్కడ ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీంతో.. అక్కడ తీవ్ర గందరగోలం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనాన్ని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఫర్హిద్ ఖాన్ అనే స్థానిక నాయకుడు గుండెపోటుకు గురయ్యాడు. మరికొంతమంది గాయపడ్డారు.

దీంతో.. షారుఖ్ ఖాన్ పై జితేంద్ర సోలంకి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే... షారుఖ్ పై కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారనే వార్తలు వచ్చాయి. దీంతో.. ఫిర్యాదు దారుడు నేరుగా వడోదర కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకొవాలని.. ఆయన టీషర్ట్ విసరడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించారు. దీంతో షారుఖ్ పై కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో... తనపై నమోదైన క్రిమినల్ కేసును, దిగువ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా షారుఖ్ చేసిన విజ్ఞప్తిని ఆలకించిన జస్టిస్ నిఖిల్ కరీర్ల్ స్పందిస్తూ... ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి ఖాన్ పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వ్యుల్లో పేర్కొంది.

ఇదే సమయంలో... షారుఖ్ జనాలను ఉత్తేజపరచడానికే అలా చేసి ఉండొచ్చని.. అంతేకానీ అది నిర్లక్ష్యంతో చేసిన పని కాదని.. షారుఖ్ తన సినిమా ప్రమోషన్ గురించి అలా చేశాడని.. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అర్ధమవుతోందని అంటూ న్యాయమూర్తి.. ఈ కేసును కొట్టివేశారు!