రేవంత్ సర్కారుకు భారీ డ్యామేజ్ గా శైలజ మరణం
ఆమె మరణం గురించిన వివరాలు తెలిస్తే మాత్రం అయ్యో అనిపించటమే కాదు మనసు చేదుగా మారుతుంది.
By: Tupaki Desk | 26 Nov 2024 5:04 AM GMTకొన్ని వ్యవస్థలు చేసే తప్పుల విషయంలో సర్కారు సరైన సమయంలో స్పందించకుంటే జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఒక మచ్చలా మారనుంది గిరిజన విద్యార్థిని శైలజ మరణం. నిజానికి.. ఆమె మరణంతో ఆయనకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. కానీ.. ప్రభుత్వాధినేతగా ఆయన ఆమె మరణానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తొమ్మిదో తరగతి చదివే శైలజ.. గడిచిన మూడువారాలుగా హైదరాబాద్ లోని నిమ్స్ లో మ్రత్యువుతో పెద్ద పోరాటమే చేసింది. అయినా.. ఆమె ఓడిపోయింది. శాశ్విత నిద్రలోకి జారుకుంది. ఆమె మరణం గురించిన వివరాలు తెలిస్తే మాత్రం అయ్యో అనిపించటమే కాదు మనసు చేదుగా మారుతుంది.
కుమురంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది శైలజ. పేద కుటుంబానికి చెందిన ఆమె వాంకిడి పాఠశాల హాస్టల్ లోనే ఉంటుంది. అక్టోబరు 30 రాత్రి ఆలుగడ్డ కూర.. పప్పుతో భోజనం తిన్న 30 మంది బాలికలు వాంతులు.. విరేచనాల బారిన పడ్డారు. రెండు రోజుల్లో వీరి సంఖ్య 60కు చేరుకుంది. ఈ విద్యార్థినులను వాంకిడి.. ఆసిఫాబాద్.. కాగజ్ నగర్.. మంచిర్యాల ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. వీరిలో శైలజ.. జ్యోతి.. మహాలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో నవంబరు 4, 5 తేదీల్లో వీరిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.
ఈ ముగ్గురిలో జ్యోతి.. మహాలక్ష్మి కోలుకున్నారు. వారిని డిశ్చార్జి చేశారు. శైలజ ఆరోగ్యం మాత్రం నానాటికి దిగజారటమే కాదు.. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న సదరు బాలిక సోమవారం సాయంత్రం ప్రాణాలు విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు. అనారోగ్యంతో కుమార్తెను ఆసుపత్రిలో చేర్చిన నాటి నుంచి తమ బిడ్డ ఆరోగ్యం మెరుగు పడుతుందని.. ఇంటికి తీసుకెళతామని భావించారు. కానీ.. అదేమీ లేకపోగా.. తాజాగా మరణించిన విషయాన్ని వైద్యులు వెల్లడించటంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఆసుపత్రిలో చేర్చి నెల రోజులు గడుస్తుననా.. తన బిడ్డ ఆరోగ్యం గురించి వైద్యులు ఏమీ చుప్పలేదని.. వాంకిడి.. మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలోనూ సీరియస్ అని చెప్పలేదని వేదన చెందుతున్నారు. శైలజ అనారోగ్యంపై ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్.. కవితలు స్పందించారు. నిమ్స్ కు వచ్చి పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సున్నిత అంశాలపై రేవంత్ సర్కారు స్పందించి.. తక్షణ చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాస్టల్ లో తిన్న ఆలూ కూర.. పప్పు ప్రాణాలు తీసే వరకు వెళ్లటం.. దీనికి కారణమైన హాస్టల్ పై అధికారులు తీసుకున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా.. కలుషిత ఆహారం తిన్న ఒక విద్యార్థిని ఇంత పెద్ద వ్యవస్థ ప్రాణాలు కాపాడలేకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. ఈ మచ్చ రేవంత్ సర్కారును దీర్ఘకాలం ఇబ్బందికి గురి చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.