Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు స్క్రీన్ ప్లే సినిమాకు మించిపోయిందిగా?

మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచి కథ మొత్తాన్ని నడిపించినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం స్టోరీకి అవసరమైన స్క్రీన్ ప్లేను మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:37 AM GMT
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు స్క్రీన్ ప్లే సినిమాకు మించిపోయిందిగా?
X

సినిమాల్ని చూసి పిల్లలు చెడిపోతున్నారా? వాస్తవాన్ని వదిలేసి.. ఊహాలోకంలో పయనిస్తున్నారా? చేతిలో పొలిటికల్ పవర్.. దానికి మించిన సంపద.. అన్నింటికి మించి అధికారుల్ని మేనేజ్ చేసే టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ.. తప్పులు చేసి తప్పించుకోవటం ఏ మాత్రం సాధ్యం కాదన్న నిజం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ప్రజాభవన్ వద్ద నిలిపిన బ్యారికేడ్లను వేగంగా దూసుకొచ్చిన కారు గుద్దేసింది. ఈ క్రమంలో యాక్సిడెంట్ చేసిన పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే షకీల్ పుత్రరత్నమన్న విషయం తాజాగా వెలుగు చూసింది. అతడ్ని తప్పించేందుకు పోలీసు అధికారి నిర్వాకం బయట పడటం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.

ప్రజాభవన్ వద్ద చేసిన యాక్సిడెంట్ లో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ ను అదుపులోకి తీసుకోవటం.. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు షకీల్ అనుచరులు వచ్చి.. అతడికి బదులుగా తమ వాడిని యాక్సిడెంట్ చేసినట్లుగా కేసు కట్టాలని చెప్పి.. సోహైల్ ను వెంట తీసుకొని వెళ్లిపోయారు. ఇలాంటి వాటి విషయాల్లో కఠినంగా ఉండాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా.. సోహైల్ స్క్రీన్ ప్లే కు తగ్గట్లు యాక్షన్ లో జీవించారు పంజాగుట్ట సీఐ.

అయితే.. అక్కడున్న సీసీ ఫుటేజ్ జరిగిన తతంగాన్ని రికార్డు చేశాయి. తన కొడుకు తప్పు చేసి.. యాక్సిడెంట్ చేయగా.. దాని నుంచి అతడ్నితప్పించి.. తమ అనుచరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకునేలా చేయటం కోసం.. మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచి కథ మొత్తాన్ని నడిపించినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం స్టోరీకి అవసరమైన స్క్రీన్ ప్లేను మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ నెల 23 అర్థరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బయటకు రావటం.. అప్పటికే ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలురావటంతో హైదరాబాద్ పోలీస్ కమిషర్ స్పందించారు. విచారణకు ఆదేశించారు. చివరకు.. పంజాగుట్ట సీఐ తో పాటు ఇతర పోలీసులు అనుసరించిన నిర్వాకాన్ని గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఈ మొత్తం కథను నడిపించిన సీఐ దుర్గారావు తీవ్రఅస్వస్థతకు గురైనట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన విచారణలో సంచలన అంశాలు వెలుగు చూశాయి.

అందులో కీలకమైంది ర్యాష్ డ్రైవింగ్ చేసి.. బ్యారికేడ్లను గుద్దేసింది షకీల్ కొడుకు సొహైల్ గా గుర్తించారు. అతడి మీద కేసులు నమోదు చేశారు. అతడ్ని కేసు నుంచి తప్పించిన సీఐపై చర్యలకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధం ఉన్న పోలీసుల పాత్ర పైనా సవివరణతో కూడిన నివేదికను సీపీ కోరినట్లుగా చెబుతున్నారు. వారిపైనా చర్యలు తప్పవంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.