Begin typing your search above and press return to search.

వివాదాస్పద అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ 'పొలిటికల్ ఇన్నింగ్స్'

పోలింగ్ నాడూ రగడే..ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పోలింగ్ సందర్భంగా షకిబ్ ఓ వ్యక్తిని కొట్టాడనే వార్త వైరల్ అయింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 7:27 AM GMT
వివాదాస్పద అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ పొలిటికల్ ఇన్నింగ్స్
X

అంతర్జాతీయ క్రికెట్ లో ఆ జట్టు ప్రమాదకర జట్టు.. దాని కెప్టెన్ అత్యంత వివాదాస్పదుడు.. మేటి ఆల్ రౌండర్ అయినప్పటికీ.. మైదానంలోనే కాదు.. బయట కూడా అతడి ప్రవర్తన అనేకసార్లు తీవ్ర చర్చనీయాంశం అయింది. అభిమానులపై దాడి.. అంపైర్లతో దురుసుతనం.. సహచర ఆటగాళ్లతో వివాదాలు.. జరిమానాలు ఇలా లెక్కలేనన్ని ఉదంతాలు.. దాదాపు 17 ఏళ్ల కెరీర్ లో గొప్ప క్రికెటర్ గా పేరుతెచ్చుకున్నా, ఈ ఉదంతాల కారణంగానే అతడిని అందరూ వివాదాస్పదుడిగానే చూశారు. అలాంటి క్రికెటర్ ఇప్పుడు పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

క్రికెట్ లో ఉంటూనే రాజకీయాల్లోకి బహుశా ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడేమో...? ఓ వైపు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతూనే అందులోనూ ఓ దేశానికి కెప్టెన్ గా ఉంటూ మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భాలు లేవేమో? ఇదంతా బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్ గురించి. బంగ్లా కెప్టెన్ అయిన అతడు తాజా ఎన్నికల్లో అక్కడి అధికార అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా నాలుగోసారీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నుంచి మగురా-1 నియోజకవర్గంలో పోటీ చేసిన షకిబ్ కు 1,85,388 ఓట్లు వచ్చాయి.

లక్ష ఓట్లపైగా ఆధిక్యంతో విజయం..బంగ్లా ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం బంగ్లా నేషనల్ పార్టీ (బీఎన్పీ) సహా 12కు పైగా రాజకీయ పార్టీలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో హసీనా పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది. మరోవైపు షకిబ్ తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి కాజీ రెజాల్ హుస్సేన్‌ పై 1,39,395 ఓట్లతో గెలిచాడు. హుస్సేన్ కు 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మొన్న కెప్టెన్ నేడు ఎంపీ ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన షకిబ్.. ఇటీవలి ప్రపంచ కప్ లో బంగ్లా కెప్టెన్ గా భారత్ లో పర్యటించాడు. గత నెల ఆఖర్లో న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. అధికార పార్టీ ఎంపీ అయినందున అతడు క్రికెట్ లో కొనసాగుతాడో లేదో చూడాలి. ఎందుకంటే.. బంగ్లాదేశ్ మంత్రిగానూ అతడికి అవకాశం దక్కే చాన్సుంది. అవామీ లీగ్.. 200 పైగా సీట్లు సాధించింది.

పోలింగ్ నాడూ రగడే..ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పోలింగ్ సందర్భంగా షకిబ్ ఓ వ్యక్తిని కొట్టాడనే వార్త వైరల్ అయింది. ఓటు వేసేందుకు వెళ్లిన షకిబ్‌ ను పదేపదే ఫొటో కోసం వెంటపడటంతో ఆగ్రహానికి గురై చెంప మీద కొట్టాడనే కథనాలు వస్తున్నాయి. కాగా, ఎడమచేతి వాటం స్పిన్ అల్ రౌండర్ అయిన షకిబ్ అల్ హసన్.. కేవలం 19 ఏళ్ల వయసులో 2006లో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 121 ఇన్నింగ్సుల్లో 4454 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేశాడు. 233 వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో 7,570 పరుగులు చేయడమే కాక 317 వికెట్లు పడగొట్టాడు. 117 టీ20ల్లో 2,382 రన్స్,140 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ లో కోల్ కతా నైట్ రౌడర్స్ కు ఆడాడు. మొత్తం 71 మ్యాచ్ లలో 793 రన్స్ చేసి.. 63 వికెట్లు పడగొట్టాడు.