సార్వత్రిక ఎన్నికల్లో పాతికేళ్ల శాంభవి చౌదరి స్పెషలేంటి?
శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో ఉంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేక వాదనలు వినిపించే బీజేపీ నుంచి బరిలోకి దిగటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
By: Tupaki Desk | 5 April 2024 7:30 AM GMTదేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్కడెక్కడో బిహార్ లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న పాతికేళ్ల (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 25 ఏళ్ల 9 నెలల వయసున్న) శాంభవి చౌదరి ఎందుకు అందరూ మాట్లాడుకునేలా మారారు? ఆమె స్పెషల్ ఏమిటి? ఆమె ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు? ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన ప్రత్యేక అంశాలు ఏం ఉన్నాయి? లాంటి ప్రశ్నలెన్నో.
వీటికి సమాధానాలు వెతికితే.. ఆమె చెబుతున్న మాటలు.. వినిపిస్తున్న వాదనలు.. ఆమె సిద్ధాంతాలు.. అంతకు మించిన భావజాలం కొత్తగా ఉండటమే. దీనికితోడు దేశంలో బరిలో ఉన్న అత్యంత పిన్నవయస్కుల్లో.. అది దళిత వర్గానికి చెందిన ఒక యంగ్ లేడీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) తరఫున పోటీ చేయటం సమ్ థింగ్ స్పెషల్ గా మారింది. అందరూ ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
ఆమె బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంఏ సోషియాలజీ చేసి బిహార్ రాజకీయాల్లోకులం.. జెండర్ ప్రాధాన్యత అనే అంశం మీద పీహెచ్ డీ చేస్తున్న శాంభవి నేపథ్యంలో పొలిటికల్ ఫ్యామిలీ. ఆమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జేడీయూలో మంత్రిగా వ్యవహరిస్తే.. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేసిన ట్రాక్ ఉంది. ఇక.. ఆమె భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నారు. ఆమె మామగారు మాజీ ఐపీఎస్ అధికారిగా సుపరిచితులు. ఇంతటి బలగం ఉన్న ఆమె రాజకీయ రంగంలోకి ప్రవేశించటం.. తన మాటలతో ఆమె అందరిని కట్టి పారేస్తున్నారు.
శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో ఉంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేక వాదనలు వినిపించే బీజేపీ నుంచి బరిలోకి దిగటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తన తండ్రి మంత్రి అయినప్పటికీ తనకు సీటు ఇవ్వటం వెనుకున్న కారణాన్ని చెప్పిన వైనం ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. తనకు టికెట్ రావటం వెనుక తన తండ్రి పాత్ర.. ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు.
పేదవారి సమస్యలు వింటూ పెరిగిన తనకు.. వారికి సంబంధించి ఏదైనా చేయాలన్న పట్టుదల ఉందని.. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకు వారిపట్ల.. వారి సమస్యల మీద అవగాహన ఉందని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తాను బరిలో దిగాలని మొదట అనుకోకున్నా తర్వాత అనుకున్నట్లు చెబుతున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనను పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తో చెప్పగా.. తనకున్న అర్హతలతోనే తనకు సీటిచ్చినట్లుగా పేర్కొన్నారు.
తన భర్తను చిరాగ్ సొంత తమ్ముడిలా చూస్తారన్న ఆమె బరిలో దిగనున్న సమస్తిపూర్ అత్తగారి ఇల్లు కావటం గమనార్హం. శాంభవి పుట్టింది పెరిగింది పాట్నాలోనే. సమస్తిపూర్ గురించి ఆమెకు పెద్దగా తెలియదు. అదే విషయాన్ని ఆమె ఒప్పుకుంటూ.. ఇప్పుడిప్పుడే తాను తెలుసుకుంటున్నాని.. తొలుత తాను అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటానన్న భరోసాను కల్పించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని యువత కాంటాక్టులోకి తాను వెళ్లినట్లు చెప్పిన ఆమె.. వారి ఆశల్ని.. ఆకాంక్షల్ని నెరవేర్చటమే తన లక్ష్యమని చెబుతున్నారు. మొత్తంగా బిహార్ రాజకీయాల్లో కొత్త తరం ఎన్నికల్లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా చెప్పక తప్పదు.